ప్రేక్షకులు కింగ్‌‌ లా ఫీలయ్యే సినిమా

ప్రేక్షకులు కింగ్‌‌ లా ఫీలయ్యే సినిమా

ఇప్పటివరకూ కామెడీ హీరోగా నవ్వించిన సంపూర్ణేష్ బాబు.. కామన్ మ్యాన్‌‌గా నటించిన చిత్రం ‘మార్టిన్ లూథన్ కింగ్’. పూజ కొల్లూరు డైరెక్ట్ చేశారు. 'కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా.. ఇందులో నటించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌‌‌‌గానూ వ్యవహరించాడు. ఈనెల 27న సినిమా విడుదల. 

ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా చేసేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఈ సినిమాకు మళ్లీ అలా ఫీలయ్యాను. రీమేక్ అయినప్పటికీ అందులోని పాత్రను ఫాలో అవకుండా, ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్ చేశాం. నటుడు‌‌ కాకముందు ఊర్లో ఓ సాధారణ వ్యక్తిగా ఎలా ఉండేవాడినో అలా ఉండమన్నారు డైరెక్టర్. నేను ఎప్పుడో నేర్చుకున్న నటనను ఈ పాత్ర నిద్ర లేపింది. ఇదొక కొత్త సినిమా. నన్ను కొత్తగా చూపించారు. ఇందులో నటించాక సమాజం పట్ల నా బాధ్యత మరింత పెరిగిందని అనిపించింది’ అన్నాడు. 

వెంకటేష్ మహా మాట్లాడుతూ ‘‘మండేలా’ చూశాక ఎన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం ఉంటే అన్ని దేశాల్లో చెప్పాల్సిన కథ ఇది అనిపించింది. ఆ తర్వాత పూజ గారిని దర్శకురాలు అనుకున్నాం. లీడ్‌‌ రోల్‌‌కి సంపూ పర్ఫెక్ట్ అనిపించింది. ఆయన కూడా పాత్రకి తగ్గట్టుగా తనని తాను మలుచుకున్నారు. ఇక  నేను పోషించిన పాత్ర మరొకరు చేయాల్సి ఉంది. కానీ ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నేను చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరికి సినిమా రెడీ అయింది. మే లోనే రిలీజ్ అనుకున్నాం. కానీ ఇప్పటికి కుదిరింది. అదే సమయానికి ఎన్నికలు రావడం అనుకోకుండా జరిగింది. సినిమా చూశాక ప్రేక్షకులు తమని తాము కింగ్‌‌లా ఫీలయ్యి థియేటర్‌‌‌‌ నుంచి వస్తారు. త్వరలో ‘మర్మానువు’ అనే ఓ డిఫరెంట్ మూవీ చేయబోతున్నా’ అని చెప్పాడు.