ఆగస్టు 7న శామ్‌సంగ్ గెలాక్సీ F34 5G ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్లు ఇవే..

ఆగస్టు 7న శామ్‌సంగ్ గెలాక్సీ F34 5G ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్లు ఇవే..

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ గెలాక్సీ F సిరీస్‌లో తక్కువ ధరలో లభించే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ ‘గెలాక్సీ F34 5G ఫోన్‌ను వచ్చే వారం లాంచ్ చేయనుంది. ఆగస్టు 7న ఈ హ్యాండ్‌సెట్‌ను ఇండియాలో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీని ధర, ఫీచర్లు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం.
ఫీచర్లు, స్పెసిఫికేషన్స్
శామ్‌సంగ్ గెలాక్సీ F34 5G ఫోన్ 6.5 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. వాటర్‌డ్రాప్ నాచ్ లుక్‌లో స్క్రీన్ కొత్తగా కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,000 nits పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని డిజైన్, ఇటీవల లాంచ్ అయిన గెలాక్సీ M34 5G (Galaxy M34 5G) మాదిరిగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కెమెరా, బ్యాటరీ
గెలాక్సీ F34 5G ఫోన్‌లో హై క్వాలిటీ కెమెరాలు ఉన్నాయి. వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ బెస్ట్ అవుట్‌పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 6,000mAh బ్యాటరీతో వస్తోంది. సాధారణ అవసరాలకు ఈ బ్యాటరీ రెండు రోజుల బ్యాకప్‌ అందించగలదని కంపెనీ చెబుతోంది.
గెలాక్సీ F34 5G స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ 13-బేస్డ్ One UI 5.1.1 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఈ డివైజ్‌కు నాలుగు జనరేషన్ల వరకు OS అప్‌డేట్స్, ఐదేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని శామ్‌సంగ్ ప్రకటించింది. శామ్‌సంగ్ వేరబుల్స్‌ కోసం ఇన్‌బిల్ట్ యాప్స్ ఈ ఫోన్‌లో ఉంటాయి.
ధర ఎంతంటే?
శామ్‌సంగ్ గెలాక్సీ F34 5G ఫోన్ లాంచ్ అయ్యాక, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. అయితే శామ్‌సంగ్, ఫ్లిప్‌కార్ట్ పోర్టళ్లలో ఈ ఫోన్ ధరను అధికారికంగా వెల్లడించలేదు. నివేదికల ప్రకారం, బేస్ మోడల్ ధర రూ.17,000 కంటే తక్కువగా ఉండవచ్చు.