
న్యూఢిల్లీ: కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్‌సంగ్ భారత్‌లో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభించింది. గ్రేటర్ నోయిడాలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఈ ఉత్పత్తి మొదలైంది. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, వేర్‌బుల్స్, టాబ్లెట్లను కంపెనీ తయారు చేస్తోంది. ల్యాప్‌టాప్‌లను కూడా తయారు చేయడం ద్వారా ఇండియాలో తమ తయారీ సామర్ధ్యాన్ని విస్తరించింది. “కంపెనీ ఇంకా మరిన్ని డివైస్‌లను భారత్‌లో తయారు చేయాలని చూస్తోంది” అని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, శామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా అధ్యక్షుడు జేబీ పార్క్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్‌పీ చున్‌తో తాజాగా సమావేశమైన విషయం తెలిసిందే. “భారత్‌లో టాలెంట్, ఇన్నోవేషన్ ఆధారంగా శామ్‌సంగ్ అధునాతన టెక్ ప్రొడక్ట్‌లను తయారు చేస్తుంది’’ అని ఈ మీటింగ్ తర్వాత పార్క్ చెప్పారు. భారత్‌లో ల్యాప్‌టాప్ తయారీకి సన్నాహాలు మొదలయ్యాయని ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ఎలక్ట్రానిక్స్ విభాగం అధ్యక్షుడు టీఎం రోహ్ ప్రకటించారు.
కాగా, గ్లోబల్‌గా చూస్తే కంపెనీకి చెందిన రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ ప్లాంట్ భారత్‌లో ఉంది. యాపిల్ తర్వాత ఇండియా నుంచి మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసే రెండవ అతిపెద్ద కంపెనీ కూడా ఇదే. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం, భారత్‌లో విలువ, వాల్యూమ్ పరంగా శామ్‌సంగ్ రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్. అయితే ల్యాప్‌టాప్ విభాగంలో ఇంకా తన స్థానాన్ని బలపరుచుకోలేదు. సైబర్‌మీడియా రీసెర్చ్ ప్రకారం, ఇండియాలో టాబ్లెట్ పీసీ విభాగంలో కంపెనీకి 15 శాతం వాటా ఉంది.