కేసీఆర్‌‌.. తెలంగాణ రైతులనూ ఆదుకో

V6 Velugu Posted on Nov 25, 2021

హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఆదివాసీలు, రైతుల తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తికాయత్ చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దుతోపాటు విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, పోడు భూముల సమస్య పరిష్కారంపై రైతు ఉద్యమం మొదలై ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాకేశ్ తికాయత్.. ఒక సంవత్సరం నుంచి దేశ రాజధానిని రైతులు, శ్రామికులు, ఆదివాసీలు, మహిళలు దిగ్బంధించినా అధికార నేతలకు కనిపించడం లేదన్నారు.

ఆరెస్సెస్ ఏం చెబితే అదే మాట్లాడతరు

‘దేశంలో అధికారంలో ఉన్నది ఓ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాదు. అది మోడీ సర్కారు కాదు.. బడా కంపెనీల సర్కారు. ఈ ప్రభుత్వాన్ని నడిపేది బడా కంపెనీలే. వాళ్లు సూచించిన విధంగానే భారత ప్రభుత్వం మాట్లాడేది. ఒక పార్టీ ప్రభుత్వం అయ్యుంటే ఉద్యమం చేస్తున్న అన్నదాతలు, గిరిజనులతో సంప్రదింపులు జరిపేది. కేంద్రంతో పన్నెండు సార్లు చర్చలు జరిగినా వాటిలో ఏదీ తేలలేదు. నేతలను ఏది అడిగినా జవాబుల కోసం రూముల్లోకి వెళ్తారు. ఆ గదికి డైరెక్టుగా పీఎం ఆఫీసు నుంచి కాంటాక్ట్ ఉంటుంది. పీఎంవోకు నాగ్ పూర్ లోని ఆరెస్సెస్ ఆఫీసు నుంచి లింక్ ఉంటుంది. వాళ్లు రాసే ప్రశ్నలే వీళ్లు అడుగుతారు’ అని రాకేశ్ తికాయత్ చెప్పారు. 

కెమెరా, కలంపై బందూక్ పెట్టిండ్రు

‘కెమెరాతోపాటు కలం (మీడియా)పై దేశంలో బందూక్ పెట్టి బెదిరిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలనూ కబ్జా చేశారు. వీటిని ప్రశ్నించడానికే సంయుక్త మోర్చా ఏర్పాటైంది. కానీ వేర్వేరు పేర్లు పెట్టి మమ్మల్ని, మా నేతల్ని విభజించేందుకు యత్నించారు. సంయుక్త మోర్చా నేతల్ని విభజించి బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను తమలో కలుపుకునేందుకు కుట్ర పన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ లో రద్దు చేసేంత వరకు మేం ఆందోళనలను కొనసాగిస్తాం. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసేంత దాకా నిరసనలను ఆపబోం. దేశంలో ప్రతి సమస్యపైనా ఉద్యమించేందుకు సంయుక్త కిసాన్ మోర్చా సిద్ధంగా ఉంది. జెండాలు, అజెండాలకు అతీతంగా ఎవరు పిలిచినా ముందుండి పోరాడతాం. 

బీజేపీకి ఏ, బీ టీమ్ గా మారారు

‘తెలంగాణ నుంచి బీజేపీకి ఓ పార్టీ మద్దతిస్తోంది. వారిని ఇక్కడే అదుపు చేయాలి. వాళ్లు చెప్పేది ఒకటి.. చేసేదొకటి. వాళ్లు బీజేపీకి ఏ టీమ్, బీ టీమ్ లా మారారు. వాళ్ల గురించి మొత్తం దేశానికి తెలుసు. ఇక్కడి ప్రభుత్వానికి ఒక విషయం చెబుతున్నాం..ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన ఆందోళనల్లో అమరులైన రైతులకు సీఎం కేసీఆర్.. రూ.3 లక్షలు ఆర్థిక సాయం ఇస్తామని అన్నారు. ఇక్కడి రైతులను కూడా టీఆర్ఎస్ సర్కారు ఆదుకోవాలి’ అని తికాయత్ డిమాండ్ చేశారు. 

 

Tagged MSP, CM KCR, modi government, new agriculture laws, rss, Parliament Sessions

Latest Videos

Subscribe Now

More News