- ఎల్లారెడ్డికి మరో 3 వేల గృహలక్ష్మి ఇండ్లు శాంక్షన్ చేస్తాం
- మంత్రిగా ఉన్నప్పుడు షబ్బీర్ అలీ ఎందుకు మెడికల్ కాలేజీ తీసుకురాలే
- రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్
కామారెడ్డి/ ఎల్లారెడ్డి, వెలుగు : కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.90 కోట్ల ఫండ్స్శాంక్షన్ చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ప్రకటించారు. సోమవారం జిల్లాలో మంత్రి పర్యటించారు. కామారెడ్డి టౌన్లో రూ.28 కోట్లతో చేపట్టిన రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, స్వాగత తోరణాలను ప్రారంభించారు. అనంతరం ఎల్లారెడ్డి టౌన్లో రూ. 60 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తాడ్వాయిలో రూ.2 కోట్లతో చేపట్టే స్టేడియానికి కూడా శంకుస్థాపన చేశారు.
కామారెడ్డి టౌన్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం కామారెడ్డిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇక్కడ డెవలప్మెంట్వర్క్స్కోసం స్పెషల్ ఫండ్స్ కింద రూ.25 కోట్లు, మున్సిపల్‌శాఖ ద్వారా స్టేడియంలో మరిన్ని పనులు, స్పోర్ట్స్‌కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.20 కోట్లు శాంక్షన్చేస్తున్నట్లు ప్రకటించారు.
సురేందర్‌ను గెలిపించాలే..
ఎల్లారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.20 కోట్లు, మున్సిపాలిటీతో పాటు, మేజర్ పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం రూ. 25 కోట్లు శాంక్షన్ చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన జీవోను మంత్రి స్టేజీ మీద ఎమ్మెల్యే సురేందర్‌కు అందించారు. గృహలక్ష్మి కింద ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు ఇచ్చామని, అదనంగా మరో 3 వేల ఇండ్లు ఇస్తామన్నారు. 2001 నుంచి 2004 మధ్య తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జాజాల సురేందర్ కేసీఆర్ వెన్నంటి నిలిచారన్నారు. 2004లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి, దక్కకపోవడంతో పార్టీ మారారని, కేసీఆర్ మీద అభిమానంతో తిరిగి సొంత గూటికే చేరారన్నారు.
వచ్చే ఎన్నికల్లో సురేందర్‌ను 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ బాగా మాట్లాడుతున్నారని, మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ ఎందుకు తీసుకురాలేకపోయారని కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గం బాల్కొండ తర్వాత ఎల్లారెడ్డికే తాను ప్రయార్టీ ఇస్తున్నట్లు చెప్పారు. విప్ గంపగోవర్ధన్, జడ్పీ చైర్పర్సన్ దఫేదర్ శోభ, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, రాజ్యసభ మెంబర్ సురేశ్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపై క్లారిటీ.. కామారెడ్డిపై నో..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసే అభ్యర్థుల విషయంలో కేటీఆర్ ఆయా చోట్ల స్పష్టత ఇస్తున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ టికెట్ విషయంలో స్పష్టత ఇచ్చినప్పటికీ, కామారెడ్డి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్‌ను 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సూచించారు. కామారెడ్డిలో మంత్రి కొద్దిసేపు మాట్లాడినా ఇక్కడ పొలిటికల్ అంశాలను ప్రస్తావించలేదు.
కేవలం ఫండ్స్ శాంక్షన్చేస్తున్నట్లు ప్రకటించారు. కామారెడ్డి నుంచి కేసీఆర్‌ను పోటీ చేయాలని తాను కోరినట్లు ఇటీవల స్థానిక ఎమ్మల్యే గంప గోవర్ధన్, కేటీఆర్ క్లారిటీ ఇస్తారేమోనని కార్యకర్తలు వేచి చూశారు. కానీ ఆయన నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.