- మండల స్థాయిలో మాన్యువల్ కూపన్లకు స్వస్తి
- ఏప్రిల్ 1 నుంచి ‘టీజీఎంఐవీ’తోనే అనుమతులు..
- ఇక అంతా ఆన్‌లైన్
- మండల స్థాయిలో మాన్యువల్ కూపన్లకు స్వస్తి
- ఏప్రిల్ 1 నుంచి ‘టీజీఎంఐవీ’తోనే అనుమతులు
- చెప్తేనే రీచ్ల నుంచి ఇసుక చేరవేత
- అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా సర్కార్ సరికొత్త వ్యూహం
మహబూబ్‌నగర్, వెలుగు: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండల స్థాయిలో సాగుతున్న ‘మాన్యువల్’ కూప న్ల దందాకు చెక్‌పెడుతూ పారదర్శకమైన ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. క్షేత్రస్థాయిలో కూపన్ల జారీలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో కేవలం ‘తెలంగాణ మన ఇసుక వాహనం’ (-టీజీఎంఐవీ) పోర్టల్ ద్వారానే అనుమతులు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో మ్యానువల్ కూపన్ల పద్ధతిని రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వారం రోజులుగా అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, తహసీల్దార్లు నోడల్ అధికారుల వివరాలు సేకరిస్తోంది. మైనింగ్ శాఖ అధికారులు ఇప్పటికే మండలాల్లో పర్యటిస్తూ కొత్త నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను తహసీల్దార్లకు అందజేస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే ఇందిరమ్మ ఇండ్లు, ప్రైవేట్ భవన నిర్మాణాలు, ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించి ఇసుక పర్మిషన్ల కోసం లబ్ధిదారులు ఇకపై తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
అప్లికేషన్ నుంచి పర్మిషన్ దాకా.. అంతా డిజిటల్
కొత్త విధానం ప్రకారం.. ఇసుక కావాల్సిన లబ్ధిదారులు టీజీఎంఐవీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. లబ్ధిదారుడు తన ఫోన్ నంబర్‌తో లాగిన్ అయ్యి పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. నివాస ప్రాంతం, అవసరమైన ఇసుక పరిమాణం (ట్రిప్పులు), సమీపంలోని ఇసుక రీచ్‌ను ఎంచుకుని దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తు మొదట పంచాయతీ కార్యదర్శి లాగిన్‌లోకి, ఆ తర్వాత తహసీల్దార్ లాగిన్‌లోకి వెళ్తుంది. తహసీల్దార్ తన డిజిటల్ సంతకంతో అప్రూవ్ చేయగానే లబ్ధిదారుడి ఫోన్‌కు క్యూఆర్ కోడ్, ఓటీపీ వస్తుంది. రవాణాలోనూ ఏదైనా ఇబ్బందులు వస్తే ఈ క్యూఆర్‌కోడ్‌ను చూసి ఆఫీసర్లు వెరిఫై చేసుకుంటారు.
రీచ్ల వద్ద పక్కా నిఘా
లబ్ధిదారుడు ఇసుక రీచ్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఉండే సాండ్ రీచ్ ఆఫీసర్‌కు క్యూఆర్ కోడ్‌ను చూపించాలి. ఆయన ఎంఐవీ యాప్ ద్వారా స్కాన్ చేయగానే లబ్ధిదారుడి పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. లబ్ధిదారుడు చెప్పే ఓటీపీని ఎంటర్ చేసి నిర్ధారించుకున్న తర్వాతే ఇసుకను వాహనాల్లో నింపి పంపిస్తారు. దీనివల్ల ఒకే పర్మిషన్‌తో పలుమార్లు ఇసుక తరలించే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ప్రస్తుతానికి టీజీఎంఐవీ వెబ్‌సైట్‌లో రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ 11 మాత్రమే ఆన్‌బోర్డ్‌లోకి వచ్చాయి.
వీటిలో మహబూబ్‌నగర్, నల్గొండ, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నారాయణపేట, మంచిర్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జోగుళాంబ గద్వాల ఉన్నాయి. మిగిలిన జిల్లాలను కూడా ఏప్రిల్ 1 నాటికి అనుసంధానించేలా మైనింగ్ శాఖ చర్యలు వేగవంతం చేసింది. ఈ సరికొత్త విధానం అమల్లోకి వస్తే సామాన్యులకు ఇసుక కష్టాలు తీరడమే కాకుండా, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే అక్రమార్కులకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.
