ఆగి ఉన్న టిప్పర్‎ను ఢీకొని ఇసుక లారీ డ్రైవర్ మృతి

ఆగి ఉన్న టిప్పర్‎ను ఢీకొని ఇసుక లారీ డ్రైవర్ మృతి

గచ్చిబౌలి, వెలుగు: ఆగి ఉన్న టిప్పర్ లారీని ఇసుక లారీ ఢీకొట్టడంతో క్యాబిన్‏లో ఇరుక్కొని డ్రైవర్ మృతి చెందాడు. గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్ బాలరాజు వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కొణిదెల గ్రామానికి చెందిన తన్నీరు శ్రీనివాస కార్తిక్ (18) గోకుల్ ప్లాట్స్‏లోని తన బాబాయి వద్ద ఉంటూ లారీ డ్రైవర్‏గా పనిచేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇసుక లోడ్‎తో కోకాపేట్ నుంచి వట్టినాగులపల్లి వైపు బయలుదేరాడు.

 మార్గమధ్యలో డంపింగ్ యార్డ్ వద్ద రోడ్డుపై ప్రమాదకరంగా నిలిపి ఉన్న టిప్పర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యి క్యాబిన్​లోనే ఇరుక్కొని కార్తిక్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.