పట్టా భూముల్లో ఇసుక మాఫియా

పట్టా భూముల్లో ఇసుక మాఫియా
  • నది మధ్య వరకూ రైతుల పేరిట అక్రమ తవ్వకాలు
  • నది లోపలి నుంచి ఇసుక లిఫ్టింగ్​
  • కరకట్టకు  పొంచిఉన్న నది లోపలి నుంచి ఇసుక లిఫ్టింగ్​ప్రమాదం

జయశంకర్‌‌ భూపాలపల్లి,వెంకటాపురం, వెలుగు:  ములుగు జిల్లా పరిధిలోని గోదావరి ఒడ్డున ఉన్న పొలాలను ఇసుక మేటల పేరుతో అక్రమార్కులు కుళ్లబొడుస్తున్నారు. భారీ వర్షాల వల్ల వరదలు వచ్చినప్పుడు సాగు భూముల్లో ఇసుక మేటలు వేస్తుంది. వీటిని తొలగిస్తేనే మళ్లీ సాగు చేసుకునేందుకు వీలుంటుంది. రైతుల పేరిట అనుమతులు తీసుకుని.. అక్రమార్కులు ఇసుక తోడేస్తున్నారు.  పొలాల్లో ఇసుక తరలించేందుకు ఇచ్చిన అనుమతులను అడ్డం పెట్టుకుని తీరం నుంచి దాదాపు కిలోమీటరు లోపలి వరకు  ర్యాంపు నిర్మించి నదిమధ్యలోంచి అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నారు. దీంతో  రూ.60 కోట్లతో కట్టిన గోదావరి కరకట్టకు ప్రమాదం పొంచి ఉంది.  ములుగు జిల్లా పరిధిలోని గోదావరి పరిసర ప్రాంతాల్లోని ఇసుక దందా చేసేందుకు హైదరాబాద్, నల్గొండ జిల్లాలతో ఏపీ నుంచి కూడా బడా వ్యాపారవేత్తలు, లీడర్లు పోటీ పడ్డారు.  ఇటు ములుగు కలెక్టరేట్​లో,  అటు హైదరాబాద్​  సెక్రటేరియట్​లో రైతుల పేరిట పర్మిషన్ల కోసం పైరవీలు చేసుకున్నారు. పట్టాదారులకు నామమాత్రంగా కౌలు డబ్బులు చెల్లించి తాము మాత్రం లక్షలు సంపాదించుకుంటున్నారు. 


ఒక్క ఎకరమూ సాగు చేయలే
 ఇసక మేటలు తీసేసి వ్యవసాయం చేసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పరిధిలో రైతుల పేరిట దరఖాస్తులు చేసుకుంటున్నారు.  పట్టా భూముల్లో ఇసుక  తరలించడానికి  ప్రభుత్వం 38 నంబర్​ జీఓ ద్వారా గైడ్ లైన్స్​జారీ చేసింది. తమ పొలాల్లో ఇసుక మేటలు వేసిందని  రైతులు స్థానిక తహశీల్దారుకు పట్టా, పాస్ బుక్ లను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ సిబ్బంది ఫీల్డ్​విజిట్ చేసి మైనింగ్ ఆఫీసర్లకు రిపోర్ట్​ పంపుతారు. అగ్రికల్చర్,  మైనింగ్,  గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి.. ఇసుక మేటల క్వాంటిటీని బట్టి ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక తొలగించాలన్నది నిర్ణయిస్తారు.  సర్వే రిపోర్ట్​ఆధారంగా కలెక్టర్ పర్మిషన్​ ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా రైతుల పేరిట ఇసుక వ్యాపారులే నడిపిస్తారు. ఆయా శాఖల అధికారులను ప్రసన్నం చేసుకుని పర్మిషన్లు పొందుతున్నారు. ఒక్కొక్కరు ఎకరం నుంచి  15 ఎకరాల్లో ఇసుక తవ్వకాల కోసం పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు. పర్మిషన్​తీసుకున్నవారు  టీఎస్ఎండీసీ రూల్స్ ‌ ప్రకారం ఇసుక అమ్మకాలు చేయాలి. గత ఆరేండ్లలో దాదాపు వెయ్యి ఎకరాల్లో ఇసుక మేటలు తొలగించినట్టు అధికారికంగా చెప్తుండగా.. ఇందులో ఒక్క ఎకరం  కూడా తిరిగి  సాగులోకి రాలేదు. అంటే పట్టాభూములపేర పర్మిషన్లు తీసుకున్నవారు నది నుంచే ఇసుక తరలించుకువెళ్తున్నారు. ఇందుకు ఇసుక వ్యాపారులు రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లోపాలను వాడుకుంటున్నారు.  నకిలీ అడంగల్స్ తయారు చేసి.. జాయింట్ సర్వే సమయంలో ఆఫీసర్లకు ముడుపులు ఇచ్చి ఇసుక నిల్వలు ఎక్కువ ఉన్నట్టు రిపోర్టు వచ్చేలా మేనేజ్​ చేస్తున్నారు. నది ఒడ్డున పొలాలనుంచి కాకుండా నది మధ్యలోంచి  భారీ వెహికల్స్‌‌ తో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం మండలాల్లో ప్రస్తుతం పదికి పైగా ఇసుక క్వారీలు నడుస్తున్నాయి.  

ప్రశ్నిస్తే కేసు పెట్టారు
గోదావరి శివారులోని జంపన్న వాగులో ఇసుక తవ్వకాలు జరపడం వల్ల మా గ్రామానికి ప్రమాదం పొంచి ఉంది.  గ్రామస్తులంతా ఆందోళన చెందడంతో  గ్రామ సర్పంచ్​గా క్వారీని బంద్​ పెట్టాలని అడిగాను. క్వారీ దగ్గరకు వెళ్లి  ప్రశ్నించినందుకు నామీద కేసు పెట్టారు. 
‒ఈసం రామ్మూర్తి, ఏటూరునాగారం గ్రామ సర్పంచ్​, ములుగు జిల్లా


కరకట్టకు దగ్గర్లోనే తవ్వకాలు
ఏటూరునాగారంలోని పట్టా భూముల్లో ఇసుక క్వారీలకు పర్మిషన్​ ఇవ్వడం వల్ల  రూ.60 కోట్లతో కట్టిన గోదావరి కరకట్టకు ప్రమాదం పొంచి ఉంది. గోదావరికి 1986లో వచ్చిన వరదల కారణంగా చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏటూరునాగారం మునిగిపోయింది. పూర్తిగా  లోతట్టు ప్రాంతాలైన ఏటూరునాగారం, రామన్నగూడెం మునిగిపోకుండా ఉండేందుకు అప్పటి ప్రభుత్వం ఈ గ్రామాల చుట్టూ రూ.60 కోట్లతో కరకట్ట నిర్మించింది. వరదలొచ్చినా ఈ గ్రామాలు సురక్షితంగా ఉన్నాయి. కరకట్టకు దగ్గరలోనే పట్టా భూముల పేరిట ఇసుక తవ్వకాలకు పర్మిషన్​ ఇవ్వడంతో ఈ గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.