ఫారెస్టోళ్లపై ఇసుక స్మగ్లర్ల దాడి?

ఫారెస్టోళ్లపై ఇసుక స్మగ్లర్ల దాడి?
  • ఫారెస్టోళ్లపై ఇసుక స్మగ్లర్ల దాడి?
  • అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • అంతా వట్టిదే అంటున్న పోడు రైతులు
  • భూములు దున్నుతున్నందునే  తప్పుడు కేసులు పెడ్తున్నారని ఆరోపణ

అశ్వారావుపేట, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్తే దాడి చేశారని, తమ జీపుపై పెట్రోల్​పోసి చంపే ప్రయత్నం చేశారని ఫారెస్ట్​ సిబ్బంది చెప్తుండగా, పోడు భూములను సాగు చేసుకుంటున్న తమను కావాలనే ఇలాంటి కేసుల్లో ఇరికిస్తున్నారని పోడు రైతులు వాపోయారు.  దమ్మపేట ఎఫ్ఆర్ఓ వెంకటలక్ష్మి కథనం ప్రకారం..అశ్వారావుపేట మండలం బండారు గుంపు అటవీ ప్రాంతంలోని లోతువాగు నుంచి సోమవారం అర్ధరాత్రి దాటాక ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే ఫిర్యాదు అందింది. దీంతో ఎఫ్ఆర్ఓ వెంకటలక్ష్మి, డ్రైవర్ రాజేశ్, బేస్ క్యాంప్ గార్డ్ జానారెడ్డి కలిసి జీపులో వెళ్లి ట్రాక్టర్లు వచ్చే దారిలో మాటువేశారు. 

గమనించిన ఇసుక స్మగ్లర్లు ఎఫ్ఆర్ఓ, సిబ్బందిపై కర్రలతో దాడిచేశారు. అనంతరం ఫారెస్ట్​వాళ్ల జీపుపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనను చిత్రీకరిస్తుండగా, వారి నుంచి స్మార్ట్​ఫోన్లను గుంజుకున్నారని ఎఫ్ఆర్ఓ వెంకటలక్ష్మి తెలిపారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకొని అటవీ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని, వారి సూచన మేరకు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశామన్నారు. కాగా, ఎఫ్ఆర్ఓ వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన బైట ధర్మారావు, బైట గోపాలరావు, సునీల్, దాసు, కొర్స మహేశ్​ అనే  ఐదుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రెహమాన్ తెలిపారు.

కావాలనే ఇరికిస్తున్నారు.. 

కాగా, ఫారెస్టోళ్లకు భయపడి రాత్రిపూట పోడుభూములు దున్నుతున్న తమ దగ్గరికి అటవీశాఖాధికారులు వచ్చారని, ఈ క్రమంలో ఘర్షణ జరిగింది తప్ప తాము ఎవరిపైనా దాడి చేయలేదని బండారుగుంపు గ్రామస్థులంటున్నారు. నిందితుల్లో ఒకరైన బైట ధర్మారావు మీడియా ప్రతినిధులతో ఫోన్​లో మాట్లాడారు. తమకు, ఇసుక అక్రమ రవాణాతో సంబంధం లేదని, ఫారెస్ట్ ఆఫీసర్లు కావాలనే  తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వాపోయాడు.