నెల్లూరు జిల్లా సంగం పెన్నా నది బ్యారేజి వద్ద భారీ ప్రమాదం తప్పింది. ఇసుక సేకరణకు ఉపయోగించే మూడు పడవలు వరద ప్రవాహంలో కొట్టుకువచ్చి బ్యారేజి వైపు దూసుకువెళ్లాయి. వీటిని అధికార యంత్రాంగం గుర్తించి ... నియంత్రించడంతో భారీ నష్టం తప్పింది.
బీరాపేరు, బొగ్గేరు వాగుల నుంచి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఆనకట్ట దగ్గర నీటిమట్టం 11 అడుగులకు చేరింది. వరద ఉద్ధృతికి వంతెన రైలింగుకు కట్టేసిన పడవల తాళ్లు తెగిపోయాయి. దీంతో ఆ పడవలు ఆనకట్ట వైపు వేగంగా కొట్టుకుపోయాయి.
ఒక పడవను ఇసుక రేవు ప్రాంతానికి, మరొకదాన్ని కనిగిరి జలాశయం ప్రధాన రెగ్యులేటర్ సమీపానికి చేర్చగలిగారు. మరో పడవ మాత్రం బ్యారేజి ఎగువన సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న పాత ఆనకట్ట క్రెస్ట్ వద్ద నిలిచిపోయింది. వరద ఉద్ధృతి కారణంగా ఆ పడవను అక్కడి నుంచి తొలగించడం సాధ్యం కాలేదు. తాళ్లతో కట్టి కదలకుండా ఉంచే ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు.
సంగం పెన్నా నదిలో ఇరుక్కున్న బోటును తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నదిలో ఇరుక్కున్న బోటును అధికారులు డ్రోన్ వీడియోలో క్షుణ్ణంగా పరిశీలించారు. బోటు బరువు 35 టన్నులు ఉండడంతో బయటికి తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బోటును బయటికి తీసేందుకు గజ ఈతగాళ్లను రప్పించారు. దిగువన పెన్నా వారధి గేట్లు ఉండడంతో ప్రమాదం పొంచి ఉందని అధికారులు తెలిపారు.
