సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు షురూ

సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు షురూ

ఝరాసంగం, వెలుగు: కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నవాహ్నిక బ్రహ్మోత్సవాలు శిఖర పూజతో ప్రారంభమయ్యాయి. ఈ నెల19 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మొదటి రోజు అధికారులు, పాలక వర్గం, అర్చకులు, భక్తులు నాగుల పుట్టలో పాలుపోసి పుట్టమట్టితో శిఖర పూజ చేశారు. అనంతరం విఘ్నేశ్వర పూజతో మొదలై ధ్వజారోహణం, స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. రాత్రికి స్వామి వారి పల్లకీ సేవ నిర్వహించారు.

ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ శివరుద్రప్ప, పాలక వర్గం చైర్మన్​చంద్రశేఖర్​ తెలిపారు. శివరాత్రి సందర్భంగా ఆలయానికి మన రాష్ట్రంతో పాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలి వస్తారన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

స్నానాలు చేయడానికి షవర్లు, దర్శనానికి ఇబ్బంది కలగకుండా ధర్మ దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం, వీవీఐపీ దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ప్రస్తుతం ఉన్న టాయిలెట్లతో పాటు మొబైల్​ టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాలకు ప్రభుత్వం రూ.10 లక్షలు కేటాయించిందన్నారు.