సంగమేశ్వరం ఎన్జీటీ కిందకు రాదు

సంగమేశ్వరం ఎన్జీటీ కిందకు రాదు

ఇంకామేం ప్రాజెక్టు పనులే మొదలు పెట్టలేదు
ఎన్జీటీలో ఏపీ సర్కార్ అఫిడవిట్

హైదరాబాద్​, వెలుగు: సంగమేశ్వరం లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టు నేషనల్​ గ్రీన్​ ట్రైబ్యునల్​(ఎన్జీటీ) పరిధిలోకే రాదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఏపీ, తెలంగాణ మధ్య ఇంటర్​స్టేట్​ వాటర్​ డిస్ప్యూట్స్​ను పర్యావరణ అంశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు ఏపీ సర్కార్​ ఎన్జీటీలో కౌంటర్​ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ కెపాసిటీ పెంపుకు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవని, వాటిని అడ్డుకోవాలని కోరుతూ నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్​ దాఖలు చేసిన పిటిషన్​పై ఏపీ జలవనరుల శాఖ స్పెషల్​ సీఎస్​ అఫిడవిట్​ ఫైల్​ చేశారు.

పాలమూరు రంగారెడ్డికే అనుమతుల్లేవ్​
కృష్ణా నదిలో లభ్యమయ్యే నీటిని ప్రాజెక్టుల వారీగా వినియోగించుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని, నీటి వినియోగాన్ని కేఆర్​ఎంబీ పర్యవేక్షిస్తోందని ఏపీ జలవనరుల శాఖ సీఎస్​ తెలిపారు. పిటిషనర్​ పేర్కొన్న పాలమూరు రంగారెడ్డికే తుది పర్యావరణ అనుమతులు లేవని, తెలంగాణ ప్రభుత్వం అనధికారింగా ఆ ప్రాజెక్టును చేపడుతోందని ఎన్జీటీకి వివరించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీం అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​ మధ్యలోంచి వెళుతోందని, ఇప్పటికీ దానిపై పబ్లిక్​ హియరింగ్​ నిర్వహించలేదని వాదించారు. శ్రీశైలం ఫోర్​షోర్​ నుంచి రోజూ 3 టీఎంసీలు ఎత్తిపోయడానికి రాయలసీమ లిఫ్ట్​ ప్రాజెక్టులో భాగంగా పంపుహౌస్​, అప్రోచ్​ చానల్​ తవ్వుతున్నామని, వాటి వల్ల ఎలాంటి ముంపు ఉండబోదన్నారు. ఇంటర్​స్టేట్​ జలవివాదాన్ని పర్యావరణ సమస్యగా మారుస్తున్నారని ఆరోపించారు.

అన్ని అనుమతులు తీసుకుంటం
రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ముందు పర్యావరణ అనుమతుల కోసం తాము నోటిఫికేషన్​ జారీ చేస్తామని ఏపీ జలవనరుల శాఖ స్పెషల్​ సీఎస్​ వెల్లడించారు. ఇంకా ఎలాంటి పనులు ప్రారంభించలేదు కాబట్టి నోటిఫికేషన్​ ఇవ్వలేదన్నారు. కృష్ణా జలాల్లో తమ రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల మేరకు కొత్తగా చేపట్టే ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకుంటామని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 841 అడుగులకు పడిపోతే పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ నీటిని తీసుకునే అవకాశంలేదని తెలిపారు. అందుకే రాయలసీమ లిఫ్ట్​ ప్రాజెక్టును చేపడుతున్నామని పేర్కొన్నారు.

For More News..

కోట్ల రూపాయల వద్దనుకుంటున్న సెలబ్రిటీలు

మా ప్రాణం తీసెయ్యండి.. వృద్ధ దంపతుల వేడుకోలు

ఐసీసీలో సత్తా ఉన్నోళ్లు లేరా?