సీఎంపై సంగారెడ్డి కలెక్టర్ శరత్ పొగడ్తలు

సీఎంపై సంగారెడ్డి కలెక్టర్ శరత్ పొగడ్తలు

సంగారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని సంగారెడ్డి కలెక్టర్ శరత్ కొనియాడారు. అంబేద్కర్ ని చూడలేదు కానీ.. కేసీఆర్ రూపంలో ఇప్పుడు ఆ అంబేద్కర్ ను చూస్తున్నానని చెప్పారు. ఆదివారం కలెక్టరేట్ లో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఆనాడు అంబేద్కర్ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో అన్ని అంశాలు పొందుపరిచారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఇప్పుడు కేసీఆర్ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

తెలంగాణ గడ్డపై పుట్టిన గిరిజన బిడ్డగా నా మనసులోని మాటలను ఒక పౌరుడిగా చెబుతున్నాను” అని ఆయన అన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై సంతోషంగా ఉందన్నారు. దేశ చరిత్రలోనే ఇదొక సంచలనమైన నిర్ణయమని చెప్పారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకు కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని అన్నారు. భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని కేసీఆర్ ప్రకటించినందుకు ధన్యావాదాలు అంటూ ఎమోషనల్ అయ్యారు. కాగా, సీఎంను పొగుడుతూ కలెక్టర్ మాట్లాడడంపై అక్కడున్నోళ్లందరూ ఆశ్చర్యంగా చూశారు.