
- 234 సంఘాలకు ఉపాధి
సంగారెడ్డి, వెలుగు: చెరువుల్లో చేప పిల్లలను పెంచేందుకు సంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు 80 శాతం చెరువులు నిండాయి. చేప పిల్లల పంపిణీకి టెండర్ల ప్రక్రియ షురువైంది. ఈనెల 30 వరకు టెండర్లు కొనసాగనున్నాయి. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తుండగా, త్వరలో జిల్లాలోని చెరువులు చేప పిల్లలతో నిండనున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 36,029 హెక్టార్ల విస్తీర్ణంలో 1,135 నీటి వనరులు ఉండగా, రిజర్వాయర్లు 3, పెద్ద చెరువులు 79, చిన్న చెరువులు 1,053 ఉన్నాయి. ఇక మత్స్యకార సంఘాలు 234 ఉండగా అందులో 12,889 మంది సభ్యులు కొనసాగుతున్నారు. చేప పిల్లలతో పాటు రొయ్యల పెంపకంపై కూడా మత్స్యశాఖ అధికారులు దృష్టి సారించారు. గుర్తింపు పొందిన సంఘాల సభ్యులు ప్రభుత్వం పంపిణీ చేసే చేప పిల్లలను చెరువుల్లో పెంచనున్నారు.
నాలుగు రకాల చేప పిల్లలు
జిల్లాలో ఈసారి నాలుగు రకాల చేప పిల్లలను చెరువుల్లో వదలనున్నారు. బొచ్చ, బంగారు తీగ, రవుట, కొర్రమీను రకాల చేప పిల్లలను చెరువుల్లో పెంచనున్నారు. 8,200 మిల్లి మీటర్ల సైజు గల చేప పిల్లలను పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. వాటికి సంబంధించిన వివరాలను సూచిక బోర్డుల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గత ఏడాది జిల్లాలో 68 లక్షలకు పైగా చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. గతేడాది కంటే ఈసారి చేప పిల్లల పంపిణీ ఎక్కువగా ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తవగానే మత్స్య సంఘాలకు చేప పిల్లలను అందజేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
టెండర్లు షురూ
జిల్లాలో చేప పిల్లల పెంపకానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అందుకు అవసరమైన టెండర్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తవగానే గుర్తింపు పొందిన సంఘాలకు చేప పిల్లలను పంపిణీ చేస్తాం. ప్రభుత్వ నిబంధన మేరకు ప్రక్రియ కొనసాగుతోంది. - ఆర్ఎల్.మధుసూదన్ రావు, మత్స్యశాఖ జిల్లా అధికారి.