పార్టీ మారినందుకు.. దిష్టిబొమ్మతో శవయాత్ర

పార్టీ మారినందుకు.. దిష్టిబొమ్మతో శవయాత్ర
  •     ఆందోల్ మండలం పోసానిపేట వాసుల నిరసన

జోగిపేట, వెలుగు: కాంగ్రెస్​ను వీడి బీఆర్ఎస్ లో చేరిన మహిళా ఎంపీటీసీ భర్త దిష్టిబొమ్మతో గ్రామస్తులంతా శవయాత్ర తీసి నిరసన తెలిపారు. కాంగ్రెస్​లో ఉన్నందుకే ఓటేసి గెలిపించామని, అలా ఎలా పార్టీ మారుతారంటూ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం పోసానిపేట గ్రామస్తులు ఆదివారం ఎంపీటీసీ దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన అన్నాసాగర్ ఎంపీటీసీ ఉమారాణి, చింతకుంట పీఏసీఎస్ సొసైటీ మాజీ చైర్మన్ మన్నె సురేందర్ బీఆర్ఎస్​లో చేరారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్​లోకి ఆహ్వానించారు. 

ALSO READ  :- సిరిసిల్లలో సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూముల్లో వెంచర్​.. 20.87ఎకరాల్లో లేఅవుట్ చేస్తున్న బల్దియా

ఈ విషయం తెలుసుకున్న పోసానిపేట గ్రామస్తులు, కాంగ్రెస్ లీడర్లు సురేందర్ దిష్టిబొమ్మను పాడెపై ఉంచి డప్పు చప్పుళ్లతో గ్రామంలో ఊరేగించారు. సురేందర్ తో పాటు ఎంపీటీసీ ఉమారాణి దిష్టిబొమ్మను దహనం చేశారు. తాము కాంగ్రెస్ నుంచి గెలిపిస్తే.. బీఆర్ఎస్​లో ఎలా చేరుతారంటూ నిలదీశారు. బీఆర్ఎస్ నుంచి ఎలా గెలుస్తారో చూస్తామంటూ హెచ్చరించారు. సురేందర్, ఉమారాణి పార్టీ మారడంపై మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. దీనిపై దంపతులిద్దరూ స్పందించారు. గ్రామంలో తాము చేపట్టిన సీసీ రోడ్లు, మురికి కాలువల పనులకు సంబంధించి రూ.15లక్షలు విలువ చేసే బిల్లులు ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతోనే గత్యంతరం లేక బీఆర్ఎస్​లో చేరాల్సి వచ్చిందన్నారు.