కేసీఆర్ను పొగడ్తలతో ముంచెత్తిన సంగారెడ్డి కలెక్టర్

కేసీఆర్ను పొగడ్తలతో ముంచెత్తిన సంగారెడ్డి కలెక్టర్
  • గిరిజనులకు 10శాతం రిజర్వేషన్.. గిరిజన బంధు సంచలన నిర్ణయాలు
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి: సీఎం కేసీఆర్ను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పొగడ్తలతో ముంచెత్తారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్.. గిరిజన బంధు సంచలన నిర్ణయాలంటూ ప్రశంసించిన ఆయన.. అభినవ అంబేద్కర్ కేసీఆర్ అని.. అంబేద్కర్ ను చూడలేదు కానీ.. కేసీఆర్ రూపంలో అభినవ అంబేద్కర్ ను చూస్తున్నామని కొనియాడారు. కేసీఆర్ వీరాభిమానిలా కలెక్టర్ తన యావత్ ప్రసంగం ప్రశంసలతోనే సాగింది. 

ఇవాళ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు చివరి రోజు కావడంతో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ ప్రసంగిస్తూ.. కేసీఆర్ నిర్ణయాల వివరాలను చదువుతూ పొగడ్తలు కురిపించారు. ఆనాడు అంబేద్కర్ అట్టడుగు వర్ణాల అభ్యున్నతి కోసం అన్ని అంశాలు పొందుపరిచి రాజ్యాంగాన్ని నిర్మించారని గుర్తు చేస్తూ.. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ‘‘గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించడం చాలా సంతోషంగా ఉంది.. దేశ చరిత్రలో ఒక సంచలమైన నిర్ణయం.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం... అలాగే భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని సంచలన నిర్ణయం తీసుకున్నారు.. గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు..’’ అని కలెక్టర్ శరత్ చెప్పారు.