బ్లడ్ స్టాక్ లేదు..సంగారెడ్డిలోని సర్కారు ఆస్పత్రుల్లో రక్తం నిల్వల కొరత

బ్లడ్ స్టాక్ లేదు..సంగారెడ్డిలోని సర్కారు ఆస్పత్రుల్లో రక్తం నిల్వల కొరత

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని సర్కారు ఆస్పత్రుల్లో రక్తం నిల్వల కొరత ఏర్పడింది.  ఎవరైనా దాతలు ముందుకొచ్చి రక్తదానం చేస్తే తప్ప బాధితులను ఆదుకునే పరిస్థితి లేకుండా పోయింది.  జిల్లా ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్‌తో పాటు జహీరాబాద్, నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సంగారెడ్డిలో కొంతమేర నిల్వలు ఉన్నా.. ఇక్కడి అవసరాలతో పాటు జిల్లాలోని అన్ని ఆస్పత్రులకు రక్తం యూనిట్లను సరఫరా చేయాల్సి వస్తుండడంతో సమస్య తీవ్రం అవుతోంది. అయినా వైద్యారోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.  బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టి దాతల నుంచి రక్తం సేకరించాల్సి ఉన్నా.. లైట్ తీసుకుంటున్నారు. 

అందుబాటులో 36 యూనిట్లే 

సంగారెడ్డి బ్లడ్ బ్యాంక్‌లో ప్రస్తుతం 36 యూనిట్ల రక్తం నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏ పాజిటివ్ 6, బీ పాజిటివ్ 12, ఓ పాజిటివ్ 16, ఏబీ పాజిటివ్ 1, ఓ నెగటివ్ 1 యూనిట్లు ఉన్నాయి. ఇక్కడి బ్లడ్ బ్యాంక్ నుంచి నిత్యం 10 యూనిట్ల రక్తాన్ని బాధితులకు అందజేస్తుంటారు. అయితే 450 పడకల రేంజ్‌ ఉన్న సంగారెడ్డిలోని జీపీహెచ్‌లో ప్రతిరోజూ దాదాపు 20 నుంచి 25 మధ్య సర్జరీలు, కాన్పులు జరుగుతుంటాయి. ఆపరేషన్లతో పాటు రోడ్డు ప్రమాదాలు, రక్తహీనత, తలసేమియా బాధితులకు వెంటనే రక్తం ఇవ్వాల్సి ఉంటుంది.  వివిధ గ్రూపులకు చెందిన రక్తం అందుబాటులో లేకపోయేసరికి అత్యవసర పరిస్థితుల్లో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దాతల కోసం ఎదురుచూపులు

రక్తం ఇచ్చే దాతల కోసం ఆస్పత్రి వర్గాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పేషెంట్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఎవరైనా రక్తదానం చేస్తే తప్పబ్లడ్‌ ఇవ్వడం లేదు.  అత్యవసమైతే ప్రైవేట్‌ హాస్పిటల్స్‌, బ్లడ్‌ బ్యాంకులకు రెఫర్‌‌ చేస్తున్నారు. సమస్య పరిష్కరించాల్సిన వైద్యారోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.  దాతలు ముందుకు వచ్చేలా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడమే కాదు బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపులు కూడా పెట్టడం లేదు.  కనీసం రెడ్‌క్రాస్ లాంటి స్వచ్ఛంద సంస్థలతోనూ కోర్డినేషన్ చేసుకోవడం లేదు. 

రక్తదానానికి ముందుకు రావాలి

సంగారెడ్డి గవర్నమెంట్ ఆస్పత్రి లో రక్త నిల్వల కొరత వాస్తవమే. నారాయణఖేడ్, జహీరాబాద్ సెంటర్లకు ఇక్కడి నుంచి పంపించాల్సి వస్తోంది. రక్తదానం చేసేవాళ్లు ముందుకు రావాలి.  ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నం.   ప్రతి ఒక్కరూ స్పందించి రక్తదానం చేయండి.. మరొకరి ప్రాణాలు కాపాడండి.

అనిల్ కుమార్, సూపరింటెండెంట్,  సంగారెడ్డి జీపీహెచ్