బడైనా.. బతుకైనా వాగు దాటితేనే!

బడైనా.. బతుకైనా వాగు దాటితేనే!

సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు: పిల్లలు బడికి పోవాలన్నా.. పెద్దలు బతుకుదెరువు చూసుకోవాలన్నా ఆ వాగు దాటి పోవాల్సిందే. లేకుంటే బడి లేదు.. బతుకుదెరువు లేదు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గైరాన్ తండా శివారులో ఉన్న గాడిద వాగు వానకాలంలో మూడు నెలలు పొంగిపొర్లుతూనే ఉంటుంది. వానకాలంలో తండావాసులు దాదాపు 3 నెలలు ఇంకో ఊరికి పోకుండా తండాలోనే ఉంటారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటాల్సిందే. తండా పిల్లలు రోజూ 6 కిలోమీటర్లు నడిచి చాప్ట (కే) గవర్నమెంట్ స్కూల్​కి వెళ్తుంటారు. వర్షాకాలంలో 3 నెలలు వాగు పైనుంచి నడుము లోతు వరకు నీరు పొంగి పొర్లుతుండడంతో స్కూల్ పిల్లలు దాటలేని పరిస్థితి. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతో వాగు దాటి బడికి పోతున్నారు. గాడిద వాగుపై హై లెవెల్ బ్రిడ్జి కట్టాలని ఆఫీసర్లతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్పందించి గాడిదవాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించేలా చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు.