సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జైలులో రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతిచెందాడు. కుటుంబీకులు, జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మర్వెల్లి గ్రామానికి చెందిన రైతు విఠల్(60)కు తుప్పు పట్టిన గన్ను దొరకడంతో ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జనవరి 31న అతనిపై అటెంప్ట్ మర్డర్, మారణాయుధాల కేసులు నమోదు చేసి కందిలోని సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు.
దాదాపు 20 రోజులుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్న విఠల్ గురువారం ఉదయం ఒక్కసారిగా అస్వస్థతకు గురికాగా గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా హాస్పిటల్‌కు తరలించగా, దవాఖాన చేరుకునే సరికి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోస్టుమార్టం నిర్వహించకుండా జాప్యం చేశారని మృతుడి భార్య లక్ష్మి ఆరోపించారు. ఎట్టకేలకు రాత్రి పోస్టుమార్టం పూర్తి చేసి డెడ్‌బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
