
సంగారెడ్డి, వెలుగు: స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎన్నికల నిబంధనలు పాటించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్న సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం 29వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. జిల్లా లో 25 జెడ్పీటీసీ, 261 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు.
613 గ్రామ పంచాయతీలలో తొలి విడతలో 334 జీపీలు, 2872 వార్డులు, రెండో విడతలో 279 జీపీలు, 2498 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీపీవో సాయిబాబా, ఇతర అధికారులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల పటిష్ట నిర్వహణ
సిద్దిపేట రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికల పటిష్ట నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. 26 మండలాల్లోని 508 గ్రామపంచాయతీలు, 4508 వార్డులకు మూడు విడతలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో పోలింగ్ కేంద్రాల ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 16 మంది జిల్లా నోడల్ అధికారులు. 92 మంది జోనల్ స్థాయి అధికారులను నియమించిచారు. 26 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు, 26 ఎంసీసీ బృందాలు ఏర్పాట్లు చేశారు.
కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు
మెదక్ : ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా లోని 21 మండలాల్లో 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ, 492 గ్రామ పంచాయతీ, 4,220 వార్డు మెంబర్ స్థానాల ఏర్పాట్లను వివరించారు. అభ్యర్థులు ప్రచారం కోసం ముందస్తు పర్మిషన్ తీసుకోవాలన్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బు వెంట తీసుకెళ్లొద్దన్నారు. పేపర్, టీవీ, సోషల్ మీడియా యాడ్స్ కోసం ఎంసీఎంసీ కమిటీ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ మహేందర్ అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టడం, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు జరుగుతుందని చెప్పారు.