జహీరాబాద్ పట్టణంలో నలుగురు మహిళలు ఘరానా మోసానికి పాల్పడ్డారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే దుకాణంలోకి వెళ్ల షాప్ యజమానిని మాటల్లో పెట్టి లక్షల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారు. బాధిత షాప్ యజమాని , పోలీసుల సమాచారం ప్రకారం.. నలుగురు మహిళలు కలిసి జహీరాబాద్‌లోని ఓ ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణానికి కస్టమర్లుగా వెళ్లారు. తమకు ముక్కుపుడకలు కావాలని షాప్ యజమానిని కోరారు. యజమాని వారికి వివిధ రకాల డిజైన్ల ముక్కుపుడకలను చూపించే పనిలో పడ్డారు.
ఈ క్రమంలో ఆ మహిళల్లో కొందరు యజమానిని రకరకాల ప్రశ్నలతో, మాయమాటలతో పూర్తిగా గందరగోళానికి గురిచేశారు. ఆయన దృష్టి మరల్చిన సమయంలో, వారిలో ఒకరు చాకచక్యంగా సుమారు 7 తులాల బంగారాన్ని దొంగిలించారు. తాము కొనుగోలు చేయకుండానే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ఆ తర్వాత దుకాణంలో స్టాక్ సరిచూసుకుంటున్న యజమానికి భారీ మొత్తంలో బంగారం తక్కువగా ఉండటంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే షాప్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఆ నలుగురు మహిళలు అత్యంత వ్యూహాత్మకంగా చోరీకి పాల్పడిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి.
బాధిత యజమాని వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన జహీరాబాద్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ఆ మహిళల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
