బోగ శ్రావణికి మద్దతుగా జగిత్యాలలో సంఘీభావ సభ

బోగ శ్రావణికి మద్దతుగా జగిత్యాలలో సంఘీభావ సభ

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులతో వేగలేకపోతున్నానని ఆరోపిస్తూ తన పదవికి రాజీనామా చేసిన బోగ శ్రావణికు మద్దతుగా జగిత్యాలలో ఆదివారం సంఘీభావ సభ ఏర్పాటు చేశారు.  పట్టణంలోని అంగడి బజార్ లో ఏర్పాటు చేసిన ఈ సభకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి పద్మశాలి రాష్ట్ర, జిల్లాల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, బీసీ సంఘాల నాయకులు తరలివచ్చారు. దొర అనే  అహంకారంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ .. భోగ శ్రావణిపై వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.  బోగ  శ్రావణి ని తిరిగి చైర్ పర్సన్ గా నియమిస్తూ మిగతా 2సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసేలా చూడాలని వారు  డిమాండ్ చేశారు. 

బీసీ మహిళ ఎదగడం చూసి ఓర్వలేక ప్రతి తప్పుకు తనని బాధ్యుల్ని చేశారని ఆరోపిస్తూ జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి బోగ శ్రావణి ఇటీవల రాజీనామా చేశారు. పేరుకే తాను మున్సిపల్ చైర్మన్ నని పెత్తనమంతా ఎమ్మెల్యేనే చలాయించేవాడని శ్రావణి ఆరోపించారు. పార్టీ కోసం పనిచేస్తున్నా కక్షగట్టి ఇబ్బందులకు గురిచేశారని అన్నారు.  ఎమ్మెల్సీ కవితను కలవకూడదని, కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదని సంజయ్ కుమార్ హెచ్చరించారని శ్రావణి అన్నారు.  ఎమ్మెల్యే నుంచి తమకు ఆపద ఉందన్న శ్రావణి తన కుటుంబానికి ఏమైనా జరిగితే అందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారణమని చెప్పారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు.