ఇష్టంగా కట్టుకున్న ఇంటిని కూల్చలేక పంజాబ్​  రైతు ప్రయోగం

ఇష్టంగా కట్టుకున్న ఇంటిని కూల్చలేక పంజాబ్​  రైతు ప్రయోగం

సంగ్రూర్: ఓ రైతు రెండేండ్లు కష్టపడి, రూ.కోటిన్నర ఖర్చు పెట్టి పెద్ద ఇల్లు కట్టుకున్నడు. అయితే అదే స్థలం గుండా కొత్త రోడ్డు వేస్తుండడంతో ఆ ఇల్లు కూల్చాల్సి వచ్చింది. ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఆ ఇంటిని కూల్చలేక.. ఏకంగా ఇంటినే వెనక్కి జరుపుతున్నడా రైతు. సుఖ్వీందర్ సింగ్ సుఖీది పంజాబ్ సంగ్రూర్ లోని రోషన్ వాలా గ్రామం. ఊర్లో తనకున్న భూమిలో రెండంతస్తుల ఇల్లు కట్టుకున్నడు. ఇప్పుడదే మార్గంలో ఢిల్లీ–అమృత్ సర్–కత్రా ఎక్స్ ప్రెస్ వే వస్తోంది.

కేంద్రం చేపట్టిన భారతమాల ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. ఇది హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల మీదుగా వెళ్తోంది. రోడ్డు కోసం సుఖ్వీందర్ భూమిలోని కొంత భాగాన్ని అధికారులు సేకరించారు. ఇంటిని కూల్చేయాలని చెప్పి పరిహారం చెల్లించారు. అయితే తన డ్రీమ్ హౌస్​ను కొంతదూరం తరలిస్తే బాగుంటుందని సుఖ్విందర్​ సింగ్​ ఆలోచించాడు. కన్ స్ట్రక్షన్ వర్కర్లతో ప్లాన్​ చేసి, జాకీలతో పైకి లేపి తరలింపు మొదలుపెట్టాడు. ఇప్పటికే 250 ఫీట్లు జరిపానని, ఇంకో 250 ఫీట్లు జరిపితే చాలని అన్నడు.