Sanjay Dutt: ఖల్ నాయక్ పెద్ద మనసు.. అభిమాని ఇచ్చిన రూ .72 కోట్ల ఆస్తి రిటర్న్.. ట్విస్ట్ ఇదే!

Sanjay Dutt: ఖల్ నాయక్ పెద్ద మనసు.. అభిమాని ఇచ్చిన రూ .72 కోట్ల ఆస్తి రిటర్న్.. ట్విస్ట్ ఇదే!

సినీ ప్రపంచంలో హీరోలు తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలోనూ తమ మానవత్వాన్ని చాటుకుంటారు. అలాంటి అరుదైన కోవకు చెందినవారే బాలీవుడ్ 'ఖల్ నాయక్' సంజయ్ దత్ (  Sanjay Dutt ) .  ఇటీవల ఆయన ఓ ఇంటర్యూలో వెల్లడించిన ఓ ఆసక్తికరమైన సంఘటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గతంలో తన అభిమాని ఏకంగా రూ. 72 కోట్ల విలువైన ఆస్తిని వీలునామా రాసిస్తే ..  సంజయ్ దత్ ఏ మాత్రం ఆలోచించకుండా ఆ ఆస్తిని తిరిగి ఆమె కుటుంబానికే అప్పగించారు.  ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  తన నిజాయితీని, మానవతావాదాన్ని సంజయ్ దత్ నిరూపించుకున్నారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. 

2018లో నిషా పాటిల్ వీలునామా వెనుక..
ఈ ఇంటర్యూలో2018లో జరిగిన ఈ సంఘటన గురించి సంజయ్ దత్ తొలిసారిగా వివరించారు.  మలబార్ హిల్స్‌లో నివసించే నిషా పాటిల్ (Nisha Patil) అనే 62 ఏళ్ల వృద్ధురాలు.. సంజయ్ దత్‌కు వీరాభిమాని. ఆమె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ, తన జీవితపు చివరి రోజుల్లో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మరణానంతరం తనకున్న 72 కోట్ల రూపాయల విలువైన ఆస్తి మొత్తం సంజయ్ దత్‌కే చెందాలని బ్యాంకుకు వీలునామా రాశారు. 2018 జనవరి 15న నిషా పాటిల్ కన్నుమూసిన తర్వాతే, ఆమె కుటుంబ సభ్యులకు సైతం తెలియని ఈ వీలునామా బయటపడింది.

ఈ వార్త తెలిసినప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని  సంజయ్ దత్ ఆనాటి అనుభవాన్ని పంచుకున్నారు. వెంటనే తమ న్యాయవాదులను సంప్రదించి, ఆ ఆస్తిని నిషా పాటిల్ కుటుంబానికే తిరిగి చేరేలా చేశానని చెప్పారు. ఆ అభిమాని నాపై చూపిన ప్రేమ, విశ్వాసం చాలా గొప్పది. కానీ, ఆ ఆస్తిపై ఆమె కుటుంబానికే హక్కు ఉంది అని సంజయ్ దత్ స్పష్టం చేశారు. నిషా పాటిల్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవకపోయినప్పటికీ, ఆమె అభిమానానికి, తనపై చూపిన అంతులేని ప్రేమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన చెప్పారు.

సవాళ్లను దాటిన హీరో
సంజయ్ దత్ సినీ ప్రస్థానం ఒక రోలర్ కోస్టర్ రైడ్‌ను తలపిస్తుంది. 1981లో 'రాకీ' (Rocky) తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుండి, ఆయన కెరీర్ ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. 'నామ్' (Naam) లోని భావోద్వేగమైన నటన, 'ఖల్ నాయక్' (Khal Nayak) లోని విలక్షణమైన పాత్ర, 'వాస్తవ్' (Vaastav) లోని అండర్‌వరల్డ్ డాన్ పాత్ర, 'మున్నా భాయ్ M.B.B.S.' (Munna Bhai M.B.B.S.) లోని గూండా-డాక్టర్ పాత్ర... ప్రతీది అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసింది. విజయాల పరంపర ఒకవైపు కొనసాగుతుండగానే, 1993 బొంబాయి బాంబు పేలుళ్ల కేసు ఆయన జీవితాన్ని కుదిపేసింది. ఆ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించి, 2016లో విడుదలయ్యారు. ఈ కఠినమైన సమయంలోనూ అభిమానులు ఆయనకు అండగా నిలిచారు. అదే ఆయనకు తిరిగి పుంజుకోవడానికి ధైర్యాన్నిచ్చింది.

►ALSO READ | దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. ఆ జాబితాలో గతంలో మరెవరికైనా చోటుందా?

బిజీ షెడ్యూల్‌తో  సంజయ్ దత్
జైలు నుండి విడుదలైన తర్వాత సంజయ్ దత్ మరింత దూకుడుగా సినిమాల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 'భూత్ని' (Bhootnii) మరియు 'హౌస్‌ఫుల్ 5' (Housefull 5) చిత్రాలలో కనిపించారు. తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబర్ 25, 2025న విడుదల కానున్న నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా నటిస్తున్న 'అఖండ 2' (Akhanda 2) చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక బాలీవుడ్‌లో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై-యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar) లో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న విడుదల కానుంది. అదే రోజు, ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో సంజయ్ దత్ నటించిన మరో హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం 'ది రాజా సాబ్' (The RajaSaab) తో 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. అంతేకాకుండా, 2026లో విడుదల కానున్న కన్నడ చిత్రం 'కె.డి. - ది డెవిల్' (KD - The Devil) లోనూ సంజయ్ దత్ నటిస్తున్నారు.