కన్వీనర్‌‌ ఎంపికపై చర్చించలే .. సంజయ్ రౌత్ వెల్లడి

కన్వీనర్‌‌ ఎంపికపై చర్చించలే .. సంజయ్ రౌత్ వెల్లడి

ముంబై :  ప్రతిపక్ష ఇండియా కూటమికి కన్వీనర్ లేదా చైర్‌‌ పర్సన్ నియామకం కోసం ఎటువంటి సమావేశం జరగలేదని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గత ఏడాది డిసెంబర్ 19న ప్రతిపక్ష కూటమిలోని పార్టీల నేతలు ఢిల్లీలో సమావేశమైన విషయం తెలిసిందే. లోక్‌‌సభ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో వీలైనంత త్వరగా సీట్ల పంపకాన్ని ఖరారు చేయాలని ఆ మీటింగ్​లో నిర్ణయించారు. కొంతమంది కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్​ చీఫ్​ మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించారు. అయితే, ముందు కూటమి గెలవడం ముఖ్యమని, ఆ తర్వాత నాయకత్వ సమస్యను ప్రజాస్వామ్యబద్ధంగా" నిర్ణయించుకోవచ్చని ఖర్గే అన్నారు. 

కాగా, ఈ అంశంపై రౌత్​ సోమవారం మీడియాతో మాట్లాడారు. జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్​ కుమార్ కూటమి అభ్యర్థి అవుతారా? అని మీడియా ప్రశ్నించగా.. ఇటీవల కూటమి సమావేశం జరగలేదని, ఢిల్లీలో జరిగిన సమావేశంలో కూడా అలాంటి ప్రతిపాదన రాలేదని అన్నారు. అయితే, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే.. ప్రతిపక్ష కూటమికి అభ్యర్థి ఉండాల్సిన అవసరాన్ని మీటింగ్​ లో ప్రస్తావించారని చెప్పారు.

బానిసత్వాన్ని ఎంచుకున్నోళ్లు మాట్లాడొద్దు..

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌‌ పై సంజయ్ రౌత్ మరోసారి మండిపడ్డారు. బానిసత్వాన్ని ఎంచుకున్న వారు ఎంవీఏ నేతలపై కామెంట్లు చేయొద్దని హెచ్చరించారు. ఎన్సీపీ చీఫ్​అనాగరికుడంటూ పవార్ చేసిన కామెంట్​ను తప్పుబట్టారు. ‘బానిసత్వాన్ని ఎంచుకున్న వారు.. పిరికివాళ్లు మాపై కామెంట్లు చేయొద్దు. ఈ విషయంపై నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరంలేదు. లోక్‌‌సభ ఎన్నికల్లో ఎవరు పనికిరాని వ్యక్తులో తెలుస్తుంది’ అని రౌత్ మీడియాతో అన్నారు. అజిత్ పవార్.. గత జులైలో 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో వెళ్లి శివసేన– బీజేపీ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే.