మిస్సయిన ఫోన్..ఎట్ల తెమ్మంటరు?

మిస్సయిన ఫోన్..ఎట్ల తెమ్మంటరు?
  • మిస్సయిన ఫోన్..ఎట్ల తెమ్మంటరు?
  • సంజయ్​ని అరెస్టు చేసినప్పుడే పోయింది 
  • దీనిపై కరీంనగర్​లో  కంప్లయింట్ ఇచ్చారు
  • వరంగల్ పోలీసులకు బీజేపీ లీగల్ సెల్ వివరణ 
  • సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత 

హనుమకొండ, వెలుగు: బీజేపీ స్టేట్​చీఫ్ సంజయ్ ఫోన్​ మిస్సయిందని, పోయిన ఫోన్​ను ఆయన ఎక్కడి నుంచి తెస్తారని బీజేపీ లీగల్ సెల్​మెంబర్స్ ​ప్రశ్నించారు. టెన్త్ పేపర్​ లీకేజీ కేసులో తన ఫోన్​ను వెంటనే అప్పగించాలంటూ సంజయ్ కి వరంగల్ పోలీసులు​ నోటీసులు ఇవ్వగా.. సోమవారం బీజేపీ లీగల్ సెల్ మెంబర్స్ కమిషనరేట్​కు వచ్చి వివరణ ఇచ్చారు. ముందుగా కమలాపూర్ స్టేషన్​కు వెళ్లగా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీఐ సంజీవ్ కమిషనర్ ఆఫీస్ కు వెళ్లారని సిబ్బంది చెప్పారు. దీంతో లీగల్ సెల్​ మెంబర్స్ అక్కడి నుంచి సీపీ ఆఫీస్​కు వచ్చారు. అదే టైమ్ లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విచారణకు వస్తున్నారనే కారణంతో పోలీసులు వారిని లోపలికి అనుమతించలేదు. 

దాదాపు గంటన్నర సేపు ఆపడంతో పోలీసుల తీరుపై లీగల్ సెల్ మెంబర్స్ మండిపడ్డారు. అప్పటికే బీజేపీ నేతలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో కొద్దిసేపు  గందరగోళం నెలకొంది. చివరికి పోలీసులు అనుమతించడంతో లీగల్​సెల్ మెంబర్స్ లోపలికి వెళ్లారు. ఈటల విచారణ తర్వాత డీసీపీ, సీఐని కలిసి వివరణ ఇచ్చారు. ‘‘సంజయ్ ఫోన్ పోయిందని బెయిల్ పిటిషన్ పై విచారణ టైమ్ లోనే జడ్జి దృష్టికి తీసుకెళ్లాం. ఈ నెల 4న కరీంనగర్​లో సంజయ్​ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి బొమ్మలరామారం తీసుకెళ్లారు. ఆ టైమ్ లోనే ఆయన ఫోన్ పోయింది. దాన్ని వెతికిపెట్టాలని కరీంనగర్ పోలీసులకు సంజయ్ ఫిర్యాదు చేశారు” అని లీగల్ సెల్ హనుమకొండ జిల్లా కన్వీనర్​విద్యాసాగర్ రెడ్డి వివరించారు.

ముగ్గురి బెయిల్ పిటిషన్ పై ఇయ్యాల తీర్పు

ఈ కేసులో నిందితులుగా కరీంనగర్​జైలులో ఉన్న బూరం ప్రశాంత్, గుండెబోయిన మహేశ్, మౌటం శివగణేశ్​బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. హనుమకొండ జిల్లా జడ్జి అందుబాటులో లేకపోవడంతో కాజీపేటలోని రైల్వే జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారణ జరిపారు. నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేశామని, ఈ టైమ్ లో బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరఫు లాయర్లు వాదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్ వచ్చిందని, వీళ్లకు కూడా ఇవ్వాలని డిఫెన్స్ లాయర్లు వాదించారు.  వాదనలు విన్న మెజిస్ట్రేట్.. తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు.

విచారణకు హాజరైన ఈటల 

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం విచారణకు హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ మహమ్మద్ అబ్దుల్ బారీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈటల ఫోన్ ను చెక్ చేసిన పోలీసులు.. ఈ కేసులో నిందితుడైన మహేశ్ టెన్త్ హిందీ పేపర్ వాట్సాప్ లో పంపినప్పటికీ, ఈటల దాన్ని ఓపెన్ చేయలేదని గుర్తించారు. నిందితుల ఫోన్ల నుంచి 15 అనుమానిత నెంబర్లను గుర్తించిన పోలీసులు.. ఆ నెంబర్లను ఈటల ఫోన్ లో చెక్ చేశారు. కానీ ఆ నెంబర్ల నుంచి ఎలాంటి వాట్సాప్ చాటింగ్ లు లేనట్లు నిర్ధారించారు. దీంతో ఈటల ఫోన్​ ను ఆయనకు తిరిగి ఇచ్చేశారు.