IPL 2024: దిగ్గజ క్రికెటర్ రికార్డ్ సమం.. రాజస్థాన్ ఆల్‌టైం బెస్ట్ కెప్టెన్‌కు చేరువలో శాంసన్

IPL 2024: దిగ్గజ క్రికెటర్ రికార్డ్ సమం.. రాజస్థాన్ ఆల్‌టైం బెస్ట్ కెప్టెన్‌కు చేరువలో శాంసన్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో బ్యాటింగ్ తో పాటు కెప్టెన్ గాను తనదైన ముద్ర వేస్తున్నాడు. ద్విపాత్రాభినయం చేస్తూ తన జట్టును క్వాలిఫయర్ 2 వరకు చేర్చాడు. 2013 లో రాజస్థాన్ జట్టులో చేరిన శాంసన్.. జట్టులో కీలక ప్లేయర్ గా ఎదిగాడు. దీంతో 2021 లో సంజు శాంసన్ ను రాజస్థాన్ యాజమాన్యం కెప్టెన్ గా నియమించింది. నాలుగు సీజన్ లలో రాజస్థాన్ జట్టు కెప్టెన్ గా ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో 2022 లో రాజస్థాన్ జట్టును ఐపీఎల్ ఫైనల్ కు చేర్చాడు. ప్రస్తుత సీజన్ లోనూ జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. 
 
రాజస్థాన్ కెప్టెన్ గా నాలుగేళ్లుగా సంజు శాంసన్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. నాలుగు సీజన్ లలో కెప్టెన్ గా 31 విజయాలను తన ఖాతాలో వేసుకొని రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన షేన్ వార్న్(31) రికార్డ్ సమం చేశాడు. బుధవారం (మే 22) ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా సంజు ఈ ఘనతను అందుకున్నాడు. 2008లో రాజస్థాన్ పగ్గాలు చేపట్టిన షేన్ వార్న్ రాయల్స్ కు 31 విజయాలను అందించి నిన్నటివరకు టాప్ లో ఉన్నాడు.

వార్న్ 55 మ్యాచ్ ల్లో ఈ ఘనత అందుకుంటే.. శాంసన్ కు 60 మ్యాచ్ లు అవసరమయ్యాయి. ఈ లిస్టులో రాహుల్ ద్రావిడ్(18), స్టీవెన్ స్మిత్(15), అజింక్య రహానే(9), షేన్ వాట్సన్(8) వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. శాంసన్ మరో విజయాన్ని అందుకుంటే రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.