హైదరాబాద్ లో సంక్రాంతి సందడి షురూ

 హైదరాబాద్ లో సంక్రాంతి సందడి షురూ
  •     భోగి మంటలు..ఇండ్ల ముంగిట గంగిరెద్దులతో విన్యాసాలు 
  •     సిటీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మొదలైన ముగ్గుల పోటీలు
  •     కొనుగోలుదారులతో రద్దీగా పతంగుల షాప్​లు
  •     ఇయ్యాల్టి నుంచి పరేడ్ గ్రౌండ్స్​లో కైట్ ఫెస్టివల్

హైదరాబాద్​, వెలుగు : సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతుండగా... మరోవైపు గ్రేటర్ సిటీలోనూ సంక్రాంతి సందడి నెలకొంది. గంగిరెద్దులతో హరిదాసులు ఇండ్ల ముందుకు వచ్చి సన్నాయి వాయిస్తూ  పండుగ వాతావరణాన్ని తీసుకొస్తున్నారు. పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు జరుగుతుండగా.. మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో ముందస్తు  భోగి, సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.  సంక్రాంతి వస్తుందంటేనే ముందుగా గుర్తొచ్చేది పతంగులు.

చిన్నా పెద్దా కలిసి సంబురంగా గాలిపటాలను ఎగురవేస్తారు. పోటీ పడుతూ పేంచీలు వేస్తుంటారు.  ప్రస్తుతం సిటీలో కలర్ ఫుల్ పతంగులతో సందడి నెలకొంది. పండుగకు నెల ముందు నుంచే పతంగులను ఎగురేస్తుంటారు. దీంతో వాటిని అమ్మే షాపులు కూడా రద్దీగామారాయి. ధూల్​పేట, గుల్జార్​హౌస్​, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని షాపులు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి.  

రూపాయి నుంచి ఐదు వందల దాకా కవర్, పేపర్​, క్లాత్.. డిఫరెంట్​ పతంగులు లభిస్తున్నాయి. ట్రెండింగ్ లో ఉన్న​ యూనిక్​ పతంగులు కొనేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ ​చూపిస్తున్నారు. డిఫరెంట్ ​స్టైల్లోని కవర్, పేపర్, క్లాత్​ పతంగులను అమ్మకందారులు అందుబాటులో ఉంచుతున్నారు.

కైట్  ఫెస్టివల్​ 

సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఏటా ప్రభుత్వం, వివిధ సంఘాలు, సంస్థలు కైట్ ​ఫెస్టివల్​ను ఘనంగా నిర్వహిస్తాయి. ఈ సారి కూడా రాష్ట్ర  ప్రభుత్వం ఈ నెల13 నుంచి పరేడ్​ గ్రౌండ్స్​లో  కైట్​ఫెస్ట్​ను ప్రారంభించనుంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో  జేఎన్టీయూలో నేడు కైట్​ఫెస్టివల్ ​ఏర్పాటు చేశారు.  సిటీలోని మరికొన్ని చోట్ల కూడా పలు సంస్థలు కైట్​ఫెస్ట్​లు నిర్వహిస్తున్నాయి.  

సిటీలోని పలు ప్రాంతాల్లో ముందస్తు వేడుకలు

పద్మారావునగర్/గండిపేట/కొడంగల్ : భోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శుక్రవారం సంక్రాంతి వేడుకలు జరిగాయి. స్కూల్ ఆవరణలో చిన్నారులతో పాటు వారి పేరెంట్స్ కు ముగ్గుల పోటీలను నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ హేమలత చీఫ్ గెస్టుగా హాజరై విజేతలకు ప్రైజ్ లు అందజేశారు. అనంతరం చిన్నారుల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి.

అత్తాపూర్ డివిజన్ హైదర్ గూడలోని టైనీ స్కాలర్ హై స్కూల్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్టూడెంట్లు, టీచర్లు వేసిన రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి.