- తొలి పుష్కర స్నానం ఆచరించిన కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, మంత్రి కొండా సురేఖ
- భక్తులతో కిటకిటలాడుతున్న పుష్కర ఘాట్లు
జయశంకర్ భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతీ అంత్య పుష్కరాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురు పుష్యమి యోగంలో ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర సరస్వతి విజయేంద్ర స్వామి తొలి పుష్కర స్నానం చేశారు. ముందుగా గోదావరి, ప్రాణహిత నదుల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న జ్ఞాన సరస్వతి మాతకు పూజలు చేశారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి వేడుకులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. ఈ సందర్భంగా శంకర సరస్వతి విజేంద్ర స్వామిగల్ మాట్లాడుతూ ధర్మ సంస్కృతిని కాపాడిన నేల తెలంగాణ అని పేర్కొన్నారు. సరస్వతి, గోదావరి, ప్రాణహిత, కృష్ణ పుష్కరాలు జరిగేది ఒక్క తెలంగాణలో మాత్రమేనని తెలిపారు.
వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మికత..
వేద పండితుల మంత్రోచ్ఛరణలతో సరస్వతీ మాత ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పుష్కరాల సందర్భంగా చేపట్టిన మహా గణపతి హోమాన్ని శంకర సరస్వతి విజేంద్ర స్వామిగల్ ప్రారంభించారు. కాశీ పండితుల సమక్షంలో చేపట్టిన నవరత్న గోదావరి హారతి తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు. తాత్కాలిక బస్టాండ్ నుంచి భక్తులను పుష్కర ఘాట్ల వద్దకు మినీ బస్సుల్లో ఉచితంగా చేరవేస్తున్నారు. చల్లని తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను సప్లై చేస్తున్నారు.
పుష్కర స్నానం ఆచరించిన గవర్నర్ దంపతులు
సరస్వతీ అంత్యపుష్కరాల్లో గవర్నర్ దంపతులు శివప్రతాప్ శుక్లా పుష్కర స్నానమాచరించారు. సాయంత్రం సరస్వతీ ఘాట్ వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు సరస్వతీ నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి చీరె, సారెలను సమర్పించి పుష్కర స్నానం ఆచరించారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. రూ.1.20 కోట్లతో నిర్మించిన మ్యూజియంను ప్రారంభించారు.
ప్రత్యేకతను చాటుకున్న
సరస్వతీ నవరత్న హారతి..
త్రివేణి సంగమ తీరంలో సరస్వతీ నవరత్న మాల హారతి ప్రత్యేకతగా నిలిచింది. భక్తులు హారతిని తిలకించారు. ప్రయాగ్ రాజ్ లో గంగా హారతిలో పాల్గొనే పండితులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించి హారతికి శ్రీకారం చుట్టింది. కాకినాడ నుంచి తెప్పించిన హంస వాహనంలో ఉత్సవ మూర్తులతో నిర్వహించిన తెప్పోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు, సాధువుల జపాలు, విద్యుత్ కాంతులతో కాళేశ్వర క్షేత్రం దేదీప్యమానంగా వెలుగుతోంది.
