నిర్మల్ జిల్లాలో ఆధునీకరణ దిశగా సరస్వతీ కాలువ..70 కోట్లతో ప్రతిపాదనలు

నిర్మల్ జిల్లాలో ఆధునీకరణ దిశగా  సరస్వతీ కాలువ..70 కోట్లతో ప్రతిపాదనలు
  • దెబ్బతిన్న లైనింగ్, కట్ట, స్ట్రక్చర్లు
  • వర్షాకాలంలో గండ్లు
  • కాలువ పొడవునా నిండిపోయిన పిచ్చిమొక్కలు
  • నీటి సరఫరాకు ఆటంకాలు
  • పనులు పూర్తయితే టేల్ ఎండ్ వరకు సాగునీరు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు అందించే సరస్వతీ కాలువకు ఎట్టకేలకు మహర్దశ పట్టబోతోంది. చాలాఏళ్ల నుంచి ఈ కాలువపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. దీని కారణంగా కాలువ కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతి ఏటా కాలువకు గండ్లు పడటం, దెబ్బతిన్న లైనింగ్ కారణంగా ప్రాజెక్టు నుంచి విడుదల చేసే నీరు ఈ కాలువ ద్వారా సక్రమంగా ప్రవహించకపోవడంతో పంట పొలాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడుతోంది.  

 యాసంగి సీజన్‌‌‌‌లో ఈ కాలువ కింద భూములకే సాగునీరు  అందుతోంది.  అయితే సరస్వతీ కాలువ ఆయకట్టు రైతాంగం ఈ కాలువకు మరమ్మత్తులు చేయించాలని ఏళ్లుగా కోరుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సరస్వతీ కాలువను ఆధునీకరణ చేస్తామని ప్రకటించింది. పదేళ్లు దాటినా ఆ ప్రకటన ఆచరణకు నోచుకోలేదు. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 

ఇప్పటికే కడెం ప్రాజెక్టుకు 11 కోట్లుఖర్చు చేసింది. దీంతోపాటు మిగతా చెరువులు, ఇతర కాలువల మరమ్మతులకు సైతం నిధులు విడుదల చేసింది. దీంతో ఇరిగేషన్ అధికారులు ఇక సరస్వతీ కాలువను కూడా ఆధునీకరించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపి ఆమోదం కోసం సంబంధిత అధికారులు ఎదురుచూస్తున్నారు.

70 కోట్లతో ప్రతిపాదనలు…

సరస్వతీ కాలువ ఆధునీకరణ పనుల కోసం ఇరిగేషన్ అధికారులు 70 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసి నిధులు మంజూరు చేయగానే మార్చి నెల నుంచి పనులు చేపట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కాలువ లైనింగ్‌‌‌‌తో పాటు చాలాచోట్ల కట్ట బలహీనపడింది. దీని కారణంగా వర్షాకాలంలో కాలువకు గండ్లు పడుతుంటాయి.  అలాగే కాలువ పొడవునా పిచ్చిమొక్కలు, బురద, మట్టి పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. దీని కారణంగా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఆధునీకరణ పనులు చేపట్టినట్లయితే కాలువకు సంబంధించిన 112 స్ట్రక్చర్లకు కూడా మరమ్మత్తులు జరుగుతాయి. ఈ కాలువ ఆధునికరణ పనులు పూర్తయితే టేల్ ఎండ్ వరకు పూర్తిస్థాయిలో ఖరీఫ్, రబీ సీజన్లకు సాగునీరు అందుతుందని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు.

సీఎం రేవంత్ పర్యటనపైనే ఆశలు…

సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో త్వరలో జరపబోయే పర్యటనపై ఇరిగేషన్ అధికారులు, రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు. జిల్లాలో ఇటీవలే నిర్మించిన సదర్‌‌‌‌మాట్ బ్యారేజీని ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వెడమ బొజ్జుతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇరిగేషన్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డిని సదర్‌‌‌‌మాట్ బ్యారేజీ ప్రారంభానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే సీఎం పర్యటనపై స్పష్టత వస్తుండడంతో ఇక్కడి ఇరిగేషన్ అధికారులు, రైతులు ఈ పర్యటనపై ఆశలు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి వేదిక నుంచే సరస్వతీ కాలువ ఆధునీకరణకు సంబంధించిన మంజూరు విషయమై ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అధికార పార్టీ వర్గాలు, ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు.