సరస్వతీ అంత్యపుష్కరాలకు అంతా రెడీ.. ఈ రాత్రి( మే 20) నుంచే ప్రారంభం..కాశీ తరహాలో గోదావరికి నవరత్న హారతి

సరస్వతీ అంత్యపుష్కరాలకు అంతా రెడీ.. ఈ రాత్రి( మే 20) నుంచే ప్రారంభం..కాశీ తరహాలో గోదావరికి నవరత్న హారతి
  • ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు 
  •     నేటి రాత్రి పుష్కర కాలం ఆరంభం

వరంగల్‍/భూపాలపల్లి, వెలుగు: దక్షిణ కాశీ కాళేశ్వర క్షేత్రం సరస్వతి అంత్య పుష్కరాలకు ముస్తాబవుతోంది. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత, తాత్కాలిక పనులను అధికార యంత్రాంగం పూర్తి చేసింది.

మెయిన్ ఘాట్, సరస్వతి ఘాట్ల విస్తరణతో పాటు గోదావరి ఒడ్డు నుంచి నీరు ఉన్న చోటుకు వెళ్లేందుకు తాత్కాలిక రోడ్లు వేశారు. బుధవారం రాత్రి పుష్కర కాలం మొదలుకానుండగా గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పుష్కర స్నానాలను ప్రారంభించనున్నారు.

ఉత్తర భారతంలో ప్రయాగ వద్ద, దక్షణాదిలో కాళేశ్వరం వద్ద మాత్రమే సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తారు. గోదావరి, ప్రాణహితల సంగమం కాళేశ్వరం వద్ద సరస్వతి నదీ అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. గతేడాది మేలో కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా జరిగాయి. గురువారం నుంచి జూన్ 1వరకు అంత్య పుష్కరాలు జరగనున్నాయి.

అంత్యపుష్కర కాలంలో పుష్కరుడు నదిలో శక్తివంతంగా కొలువై ఉంటాడని.. పురాణాల ప్రకారం ముక్కోటి దేవతలు సైతం పుష్కర సమయంలో నదిలో అంతర్వాహినిగా స్నానం ఆచరిస్తారని అర్చకులు చెబుతున్నారు. కాశీలో గంగా హారతి మాదిరిగానే కాశీ పండితులతో నిరుడు ప్రారంభమైన గోదావరి హారతి ప్రతి రోజు సాయంత్రం కొనసాగుతోంది. 9గద్దెలను నిర్మించి కాశీ పండితులు 12 రోజుల పాటు నవరత్న హారతి ఇవ్వనున్నారు. 

40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా

అంత్యపుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లతో పనులు చేపట్టి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అంత్యపుష్కరాలకు 40 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు మహరాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల వాహనాల కోసం 250 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేసింది. ట్రాఫిక్ నియంత్రణకు వన్ వే అమలు చేయనున్నారు.

గోదావరిలో పడవలతో గజ ఈతగాళ్లు పహారా కాయనున్నారు. తాత్కాలిక బస్టాండ్ నుంచి భక్తులకు ఘాట్ల వద్దకు ఉచితంగా తరలించేందుకు మినీ బస్సులను ఏర్పాటు చేశారు. గోదావరి వద్ద భక్తులకు, వీఐపీలకు వేర్వేరు ఘాట్లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర గవర్నర్​ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు ఆహ్వానాలు అందించారు. 

3 వేలకుపైగా బస్సులు, 16 హెల్త్​ క్యాంప్‌‌లు 

పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి 3,360 బస్సులతో 5,772 ట్రిప్పులు నడపనున్నట్లు ఆర్టీసీ వరంగల్‍ రీజియన్‍ మేనేజర్‍ ఎస్‍.భవానీ ప్రసాద్‍ తెలిపారు. కాళేశ్వరంలో 4.36 ఎకరాల్లో తాత్కాలిక బస్‍స్టేషన్‍, ఎండాకాలం నేపథ్యంలో వెయిటింగ్‍ షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. వైద్యారోగ్య శాఖ16 వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది.

దాదాపు 600 మంది సిబ్బంది వైద్య సేవలందించనున్నారు. ఎమర్జెన్సీ కోసం ఎనిమిది 108 వాహనాలు, మరో అత్యాధునిక అంబులెన్స్​, 5 బైక్‍ అంబులెన్స్​లు సిద్ధంగా ఉంటాయి. అంత్య పుష్కరాల్లో విద్యుత్ అంతరాయం రాకుండా ఏర్పాట్లు చేసినట్లు టీజీఎన్‌‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు.

కాళేశ్వరం పుష్కరాల వద్ద 8, 9 ,11 మీటర్ల విద్యుత్​ స్థంభాలు ఏర్పాటు చేశామని, సుమారు 5 కిలోమీటర్ల 11 కేవీ లైన్, 12 కిలోమీటర్ల ఎల్‌‌టీ లైన్ వేశామని, 18 ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 12 రోజులూ నిరంతర విద్యుత్ సరఫరా కోసం నలుగురు డివిజనల్ ఇంజినీర్లతో పాటు ఇంజనీర్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు.