వెంటిలేటర్ పై శరత్ బాబు..అవయవాలు డ్యామేజ్..  విషమంగా ఆరోగ్యం

వెంటిలేటర్ పై శరత్ బాబు..అవయవాలు డ్యామేజ్..  విషమంగా ఆరోగ్యం

ప్రముఖ నటుడు శరత్ బాబు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఏప్రిల్ 24వ తేదీ సాయంత్రం.. ఆయనకు జరుగుతున్న చికిత్సకు సంబంధించి వివరాలను వెల్లడించాయి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి వర్గాలు. శరత్ బాబు చికిత్సకు స్పందిస్తున్నా..అవయవాలు బాగా దెబ్బతిన్నాయని.. కిడ్నీలు, కాలేయం పనితీరు సరిగా లేదని వివరించారు డాక్టర్లు. మల్టీ ఆర్గాన్ డ్యామేజ్ కావటంతో.. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. 

శరత్ బాబు కొన్నాళ్లుగా సెప్సిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులు ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. రెండోసారి వ్యాధి తిరగబడటంతో చెన్నై నుంచి బెంగళూరు తరలించి వైద్యం చేయించారు. అయితే అక్కడ మెరుగుపడకపోవటంతో..  హైదరాబాద్ తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నారు కుటుంబ సభ్యులు. సెప్సిస్ వ్యాధి ప్రభావం.. మిగతా అవయవాలపై పడిందని.. లంగ్స్ బాగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు డాక్టర్లు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని.. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు డాక్టర్లు. 

శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. 1973లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శరత్ బాబు దక్షిణాదిన అన్ని భాషల్లో నటించారు. రామరాజ్యం అనే చిత్రంలో తొలిసారి నటించారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య , ఆపద్భాందవుడు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శరత్ బాబు నటించారు. నెగిటివ్ రోల్స్ లో సైతం ఆయన మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శరత్ బాబు మూడు నంది అవార్డులు అందుకోవడం విశేషం. ఇక శరత్ బాబు, రమాప్రభ మధ్య ఇప్పటికి తేలని వివాదం ఉంది. ఇక శరత్ బాబు చివరగా వకీల్ సాబ్ చిత్రంలో నటించారు. 

ప్రస్తుతం శరత్ బాబు వయస్సు 71 ఏళ్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా.. సపోర్టింగ్ ఆర్టిస్టుగా తెలుగు, కన్నడ, తమిళ, మళయాళం భాషల్లో 250కి సైగా సినిమాల్లో నటించారు. ఆయన త్వరగా కోలుకోవాలని తెలుగు, తమిళ సినీ రంగం ప్రముఖులు కోరుకుంటున్నారు.