ముగిసిన శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు ఈడీ కస్టడీ

ముగిసిన శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు ఈడీ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2గంటలకు అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో వారిని ప్రవేశపెట్టనున్నారు. నిజానికి మద్యం కుంభకోణంలో అరెస్టైన శరత్, బినోయ్ బాబు కస్టడీ నవంబర్ 17న ముగిసింది. అయితే ఈడీ అభ్యర్థన మేరకు న్యాయస్థానం వారి కస్టడీని మరో 4రోజులు పొడగించింది. తాజాగా ఆ గడవు కూడా ముగియడంతో అధికారులు వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈడీ కస్టడీ పొడగింపు కోరని పక్షంలో న్యాయమూర్తి వారికి జ్యూడిషియల్ రిమాండ్ విధించే అవకాశముంది. 

లిక్కర్ స్కాంలో నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ కస్టడీ పొడగిస్తూ ఇటీవలే సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ అధికారుల అభ్యర్థన మేరకు వారిద్దరి కస్టడీని మరో 5 రోజులు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రౌస్ అవెన్యూ కోర్టు అభిషేక్ రావు, విజయ్ నాయర్లకు ప్రశ్నించేందుకు ఈడీకి 5 రోజుల కస్టడీకి అనుమతివ్వగా..నవంబర్ 14తో అది ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు కస్టడీ పొడగించాలని పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయమూర్తి ఈడీ కస్టడీని మరో 5 రోజులు పొడగించింది. కేసు తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది.

మరోవైపు స్కాంతో సంబంధమున్న రాజ్ కుమార్ ను ఈడీ అధికారులు ఇవాళ ప్రశ్నించనున్నారు. కుంభకోణానికి సంబంధించి ఈడీ అరెస్ట్ చేసిన సమీర్ మహేంద్రు జ్యూడీషియల్ రిమాండ్ నవంబర్ 26 వరకు పొడగిస్తూ కోర్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.