- నిండు చూలాలికి కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా స్వీపర్లు, సూపర్వైజర్లు
- తల్లీ బిడ్డ క్షేమం
- సిబ్బందికి వెల్లువెత్తుతున్న ప్రశంసలు
కరీంనగర్ టౌన్, వెలుగు : ఊరెళ్దామని వచ్చిన ఓ నిండు గర్భిణి బస్టాండ్‌లో నొప్పులు పడుతుంటే ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలు అడ్డు పెట్టి డెలివరీ చేశారు. 108 వచ్చే లోపు సాధారణ ప్రసవం చేసి తల్లిని, బిడ్డను దవాఖానకు తరలించారు. కరీంనగర్ స్టేషన్ మేనేజర్ రజనీకృష్ణ కథనం ప్రకారం..ఒడిశాకు చెందిన వలస కూలీ కుమారి ఆమె భర్త దూలతో కలిసి పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి ఇటుకబట్టీలో పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం కుంట వెళ్దామని కరీంనగర్ బస్టాండ్‌లో భద్రాచలం బస్సు ఎక్కేందుకు వచ్చారు.
కుమారి నిండు గర్భిణి కాగా.. ఆమెకు బస్టాండ్లోనే నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే భర్త ఆమెను పక్కన పడుకోబెట్టి సాయం కోసం ఆర్టీసీ అధికారులను వేడుకున్నాడు. దీంతో వారు 108కు సమాచారమిచ్చారు. ఈలోగా నొప్పులు ఎక్కువకావడంతో ఆర్టీసీ మహిళా స్వీపర్లు, సూపర్ వైజర్లు ముందుకు వచ్చారు. చీరలను అడ్డు పెట్టి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది.
కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రాగానే తల్లీబిడ్డను కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. కాగా, బస్టాండ్‌లో మహిళకు డెలివరీ చేసి మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బందిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వారిని పలువురు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
