
సెక్రటేరియెట్ పనులు జనవరి 18 కల్లా కావాలె
వర్క్ ఏజెన్సీకి సర్కార్ ఆదేశం
ఆ నెల 24 నుంచి మంచి రోజులు
ఓపెనింగ్ చేసే యోచనలో ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్, అమరవీరుల స్తూపం పనులు జనవరి 18 కల్లా పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీని సర్కార్ ఆదేశించినట్లు తెలిసింది. జనవరి 24 నుంచి మంచి ముహుర్తాలు ఉండడంతో సెక్రటేరియెట్ ను ఓపెన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో సెక్రటేరియట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మూడు షిఫ్టులలో 3 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఫినిషింగ్ వర్క్ చేయాల్సి ఉంది. ఫినిషింగ్ వర్క్ చేయడానికే ఎక్కువ టైమ్ పడుతుందని వర్క్ ఏజెన్సీ షాపూర్ జీ పల్లోంజీ ప్రతినిధులు అంటున్నారు. తొందరగా పనులు చేస్తే తర్వాత డ్యామేజ్ జరిగితే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 18 కల్లా 6వ ఫ్లోర్ లోని సీఎంవోతో పాటు ఎంత వరకు పనులు పూర్తయితే అంతవరకు చేస్తామని తెలిపారు. కొన్ని పనులు మిగిలి ఉన్నా ఓపెనింగ్ చేయాలని సర్కార్ నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్ విషయంలోనూ ఇలాగే జరిగిందన్నారు. అక్కడ సీఎం కేసీఆర్ ఓపెన్ చేశాక బ్యాలెన్స్ పనులు చేస్తున్నామని తెలిపారు. కాగా, ఇటీవల సెక్రటేరియెట్ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు పలు సూచనలు ఇచ్చారు.
ఏప్రిల్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ..
హుస్సేన్ సాగర్ సమీపంలో నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ల్యాండ్ స్కేప్ ఏరియా, వాటర్ ఫౌంటెయిన్, తెలంగాణ తల్లి విగ్రహం, మ్యూజియం, ఆడిటోరియం, పైఅంతస్తులో ఏర్పాటు చేసే రెస్టారెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయి. దుబాయ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన స్టెయిన్ లెస్ స్టీల్ షీట్స్ వాడుతున్నారు. ఇక్కడ నిరంతరం జ్వలించే జ్యోతి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కాగా, సాగర్ తీరంలో నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పనులు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతికి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి మూడు ప్రాజెక్టులను ఒకేసారి ఓపెన్ చేయాలని అనుకున్నప్పటికీ, పనులు పూర్తి కాకపోవడంతో రెండు ప్రాజెక్టులనే ఓపెన్ చేయాలని నిర్ణయించింది.