దండేపల్లి/ఎల్కతుర్తి, వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రధానంగా కోతుల సమస్య ఉండడం, ఆ సమస్యను పరిష్కరించే వారికే ఓటు వేస్తామంటూ గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన క్యాండిడేట్లు కోతుల సమస్య పరిష్కరించే దిశగా ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగా ఓ గ్రామానికి చెందిన క్యాండిడేట్ కొండెంగలను తీసుకొచ్చి కోతులను తరిమేసే ప్రయత్నం చేయగా.. మరో గ్రామంలో క్యాండిడేట్లు ఏకంగా తన అనుచరులతో ఎలుగుబంటి వేషం వేయించి గ్రామాల్లో తిప్పుతున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ క్యాండిడేట్‌గా కాంగ్రెస్ తరఫున ఆజ్మీరా రాజేశ్వర్ నామినేషన్ వేశారు. అయితే కోతుల బెడద నుంచి తప్పించినోళ్లకే ఓట్లు వేస్తామని గ్రామస్తులు ఇటీవల ప్లకార్డులు ప్రదర్శించారు.
దీంతో స్పందించిన రాజేశ్వర్ ఏపీలోని నూజివీడు నుంచి మూడు కొండెంగలను తెప్పించి గ్రామంలో కోతులను తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామస్తులు సైతం కోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమను గెలిపిస్తే కోతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామంటూ సర్పంచ్ క్యాండిడేట్లు శ్రీరామ్, నాగలక్ష్మి చెబుతున్నారు. ఇందులో భాగంగా తమ అనుచరులకు ఎలుగుబంటి వేషం వేయించి గ్రామంలో ఇంటింటికీ తిప్పుతూ ప్రచారం చేస్తున్నారు.
