కుక్కలను తరిమేస్త..కోతులను పట్టిస్త! ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల హామీలు

కుక్కలను తరిమేస్త..కోతులను పట్టిస్త! ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల హామీలు
  • గుడులు కట్టిస్త.. కుల సంఘాలకు పైసలిస్త..ఎన్నికల్లో సర్పంచ్​ అభ్యర్థుల హామీలు 
  • చాలా గ్రామాల్లో కోతుల నివారణే ప్రధాన అజెండా
  • కుక్కలు, కోతుల బెడద తీర్చినోళ్లకే ఓటేస్తామంటూ పలుచోట్ల బ్యానర్లు 
  • సమస్యలు పరిష్కరిస్తామని బాండ్​ రాసిస్తున్న క్యాండిడేట్స్‌‌
  • కుల సంఘాలకు ఓటుకు ముందే రేటు ఫిక్స్..
  • యువతకు క్రికెట్ కిట్లు.. మహిళలకు చీరల పంపిణీకి  ఏర్పాట్లు 

హైదరాబాద్, వెలుగు: సర్పంచ్ ఎలక్షన్ల ప్రచారంలో  కొత్త ట్రెండ్ మొదలైంది. గతంలో ‘‘రోడ్లు వేయిస్తాం..  నీళ్లిస్తాం” అని హామీ ఇచ్చినోళ్లకే ఓటేస్తామని చెప్పే జనాలు.. ఇప్పుడు కోతులు, కుక్కల బెడద తీర్చినోళ్లను గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. దీంతో చాలా గ్రామాల్లో కోతులు, కుక్కల నివారాణే ప్రధాన అజెండాగా మారింది. ఈ సమస్యకు శాత్వత పరిష్కారం చూపినవారి వెంటే తాము నిలుస్తామని ప్రజలు చెబుతుండగా.. అభ్యర్థులు సైతం ‘కోతులను పట్టిస్తం.. కుక్కలను తరిమేస్తం’ అంటూ హామీలిస్తున్నారు.  కుల, యువజన, మహిళా సంఘాలవారీగా గంప గుత్తగా ఓట్ల కోసం ఊరూరా దావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేస్తున్నారు. 

కులాల వారీగా కమ్యూనిటీ హాళ్లలో సౌకర్యాలు, యువతకు క్రికెట్​ కిట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మహిళలకు చీరలు, ఇతర కానుకలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  గ్రామాల్లో ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యల చిట్టాను రూపొందించి.. మ్యానిఫెస్టో తయారుచేసి, ప్రకటిస్తున్నారు. మరోవైపు ‘‘ఊర్లో శిథిలావస్థలో ఉన్న గుడిని బాగుచేయిస్తం, బడిలో పిల్లలకు వసతులు కల్పిస్తం” అంటూ బాండ్​ పేపర్లు రాసిస్తున్నారు. 

కుక్కలు, కోతుల బెడదే ప్రధాన సమస్యలు..

ప్రస్తుతం గ్రామాల్లో కుక్కలు, కోతుల బెడదే ప్రధాన సమస్యలు. సర్పంచ్​ అభ్యర్థుల ముందున్న ప్రధాన సవాళ్లు కూడా.. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించకోపోయినా ఫర్వాలేదు కానీ, కోతులు, కుక్కల బెడద నుంచి తప్పించాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు వీటినే ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నరు. కొన్ని గ్రామాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు సొంత డబ్బులతో మంకీ క్యాచర్లను పిలిపించి.. పని కూడా మొదలెట్టారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లా కొత్తగట్టు సర్పంచ్ అభ్యర్థి మాడ స్వాతి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తన మేనిఫెస్టోలోని మొదటి హామీగా ‘‘నెల రోజుల్లో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం’ అని ప్రకటించారు. అర్హులందరికీ ఆసరా పెన్షన్లు, టోల్ గేట్ వద్ద యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

మహిళా సంఘాలకు పీఎంఈజీపీ సబ్సిడీ రుణాలు ఇప్పించడంతో పాటు కుల సంఘానికి కమ్యూనిటీ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తామని,  మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. ఇక,  రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఏల్ల బాల్ రెడ్డి అనే సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారంతో వార్తల్లో నిలిచారు. గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు ఆయన ఓ మనిషికి ఎలుగుబంటి వేషం వేయించి, నెలకు పదివేల జీతం ఇచ్చి మరీ ఊరంతా తిప్పుతున్నారు. 

ఆ ఎలుగుబంటి వేషాన్ని చూసి కోతులు పారిపోతుండటంతో జనం తనకే ఓటేస్తారని ఆయన నమ్ముతున్నారు. కోతుల బెడద తీర్చినోళ్లకే ఓటేస్తామని కొత్తగూడెం జిల్లా ములకలపల్లి గ్రామస్తులు ఇప్పటికే ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా ముచ్చర్ల గ్రామంలో.. తమ డిమాండ్లు నెరవేర్చిన అభ్యర్థులకే ఓటేస్తామంటూ ప్రజలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో యువకులు కోతుల సమస్య పరిష్కరించిన వారికే ఓటేస్తామని బ్యానర్​కట్టారు. రంగారెడ్డి జిల్లా కోహెడ మండలంలో  ‘కోహెడ పాలిటిక్స్’ అనే వాట్సాప్​ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోతుల సమస్య పరిష్కరించిన వారికే ఓటు వేయాలని మెసేజ్​ సర్క్యులేట్ చేస్తున్నారు.  

కుల సంఘాలకు బంపర్ ఆఫర్ 

ఎలక్షన్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్​ మొదలైంది. కుల, మహిళా, యువజన సంఘాల నుంచి గంప గుత్తగా ఓట్లు రాబట్టేందుకు  బేరసారాలు మొదలు పెట్టారు. ‘ఓట్లన్నీ మాకే వేయండి.. మీకు కావాల్సినవన్నీ చేస్తాం” అంటూ  కుల పెద్దలతో సీక్రెట్ మీటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెడుతున్నారు. ‘కమ్యూనిటీ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్థలం ఇచ్చి.. బిల్డింగ్ కట్టిస్తానని ఆఫర్లు ఇస్తున్నారు.  ఇప్పటికే ఉన్న హాళ్లకు రంగులు వేసి, రిపేర్లు చేయిస్తామని, అందులో  ఫ్యాన్లు, కుర్చీలు, వంట సామాన్లు, సౌండ్​ సిస్టమ్​ సొంత ఖర్చులతో సమకూరుస్తుమంటున్నారు. 

యువతను  మచ్చిక చేసుకునేందుకు ఊర్లో ఉన్న క్రికెట్, వాలీబాల్ టీంలకు కొత్త కిట్లు పంపిణీ చేసేందుకు రెడీ అయ్యారు. మరోవైపు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మహిళా సంఘాల వారీగా ప్రత్యేక నజరానాలు ప్రకటిస్తున్నారు. చీరలు, ఇతర గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు.   

రూ.10 లక్షల నుంచి కోటి వరకు.. 

ఒకప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు మధ్య చాలా తేడా కనిపిస్తున్నది. గతంలో సర్పంచ్ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెద్దగా ఖర్చు పెట్టకపోయేవారు. కానిప్పుడు చిన్న పంచాయతీలోనూ ఖర్చు రూ.10 లక్షలు దాటుతున్నది. మేజర్ పంచాయతీలైతే కోటి దాటుతున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు సర్పంచ్ పదవిని స్టేటస్ సింబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా భావిస్తుండటంతో ఖర్చుకు వెనకాడడడం లేదు. కొందరు అభ్యర్థులు శుభకార్యాలకు, చావులకు అవసరమయ్యే టెంట్ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సామాను కొని గ్రామ పంచాయతీకి అప్పగిస్తూ ఓటు తనకే వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.