
సర్పంచుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు అందోల్ కృష్ణ
ఉప సర్పంచ్‌లకు ఇచ్చిన జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేయాల్సిందేనని, ఈ విషయంలో తాము వెనక్కితగ్గేది లేదని సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అందోల్ కృష్ణ అన్నారు. 15వ తేదీలోగా తమ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని చెప్పారు. గురువారం (8వ తేదీన) హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో సర్పంచుల మహాధర్నా నిర్వహించాల్సి ఉందని, కానీ ప్రభుత్వ అనుకూల సంఘం నాయకుడు ఒకరు సృష్టించిన గందరగోళం, అసత్య ప్రచారం వల్ల వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాయింట్ చెక్ పవర్ విషయంలో ఆందోళనకు తాము సిద్ధమయ్యామని చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ 15వ తేదీ నాటికి ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దవుతుందన్నారంటూ ఓ సంఘం నేత ప్రకటించి గందరగోళం రేపారని తెలిపారు. సర్పంచ్‌ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టిన ప్రతిసారి దానిని నీరుగార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ తాము ఆందోళనకు పిలుపునిస్తే ధర్నా వాయిదాపడిందంటూ వాట్సాప్, ఫోన్ మెస్సేజ్‌లు పంపారని చెప్పారు. సర్పంచుల సమస్యలను 15వ తేదీలోగా తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సర్పంచ్ ఒక్కరినే ఎలా సస్పెండ్ చేస్తరు?
సర్పంచ్, ఉప సర్పంచ్ సమానమేనని ఒకటికి పదిసార్లు నొక్కి చెప్తూ జాయింట్ చెక్ పవర్ ఇచ్చిన సర్కారు.. గ్రామసభ నిర్వహించలేదని ఒక్క సర్పంచ్‌నే ఎలా బాధ్యుడిని చేసిందని అందోల్ కృష్ణ ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా చెర్కుపల్లిలో గ్రామసభ నిర్వహణకు నోటీసులు జారీ చేయని పంచాయతీ కార్యదర్శిని, సర్పంచ్‌తో సమానంగా చెక్ పవర్ కలిగిన ఉప సర్పంచ్‌ను సస్పెండ్ చేయకుండా కేవలం సర్పంచ్‌ను మాత్రమే ఎలా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. గ్రామసభ నిర్వహించలేదని మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేసేస్తే కేసీఆర్‌కు దేశంలోనే గొప్ప సీఎంగా పేరొస్తుందని ఎగతాళి చేశారు.
నిధులివ్వనోళ్లకు నిందించే అధికారం లేదు: అశోక్
కొత్త సర్పంచులు ఎన్నికై ఆరు నెలలు దాటినా రాష్ట్ర ఖజానా నుంచి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సర్పంచుల ఐక్య వేదిక రాష్ట్ర నాయకుడు అశోక్ రెడ్డి చెప్పారు. పైగా కేంద్రం నుంచి వచ్చిన 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులను ఫ్రీజింగ్ పేరిట ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపించారు. విడుదల చేసిన నిధుల్లోనూ 20 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుందన్నారు. స్థానిక సంస్థలకు నిధులివ్వని ప్రభుత్వానికి.. సర్పంచ్‌లను నిందించే అధికారం లేదని చెప్పారు. తాము ఏ పార్టీ గుర్తుతో గెలవలేదని, ప్రజలు తమ ముఖం చూసి గెలిపించారన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని కామెంట్ చేశారు.
ముందు నిధులివ్వండి
గ్రామ స్వరాజ్యం సాకారం కావాలంటే ముందు నిధులు విడుదల చేయాలని నల్లగొండ జిల్లా చండూరు మండలం తిమ్మారెడ్డిగూడెం సర్పంచ్ కె.వెంకట్‌రెడ్డి అన్నారు. తాను రిటైర్డ్ హెచ్ఎంనని, తనను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకుని సర్పంచ్‌ను చేశారని తెలిపారు. ఆరు నెలలుగా పంచాయతీకి నిధులు రాలేదని, ఇప్పటివరకు సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చుల కోసం తాను సొంతంగా రూ.లక్ష వరకు ఖర్చు చేశానని చెప్పారు. డిజిటల్ చెక్కులు ఇచ్చినా డబ్బులు డ్రా కావడం లేదన్నారు. హరితహారాన్ని సక్సెస్ చేసేందుకు గ్రామానికో వాటర్ ట్యాంకర్, వాటర్ మన్, ట్రీగార్డులను సమకూర్చాలని సూచించారు.