గ్రామ సభ నుంచి రికార్డులెత్తుకెళ్లిన సర్పంచ్ భర్త

గ్రామ సభ నుంచి రికార్డులెత్తుకెళ్లిన సర్పంచ్ భర్త
  • సర్పంచ్​ భర్తపై ఆగ్రహం.. 
  • జీపీ సెక్రెటరీ, కారోబార్​ నిర్బంధం

నర్సింహులపేట(దంతలపల్లి), వెలుగు: మహబూబాబాద్ జిల్లాకు చెందిన సర్పంచ్​భర్త గ్రామ సభ నుంచి రికార్డులు, తీర్మానం బుక్కులు తీసుకెళ్లడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పంచాయతీ సెక్రెటరీ, కారోబార్​ను నిర్బంధించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దంతలపల్లి మండలం ఆగపేటలో సోమవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఊర్లోని సమస్యలను అస్సలు పట్టించుకోవట్లేదని సర్పంచ్​ఇమ్మడి సంధ్యను గ్రామస్తులు, వార్డు సభ్యులు నిలదీశారు. చేసిన పనులకు తీర్మానాలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సభ జరుతుండగానే ఎలాంటి సమాధానం చెప్పకుండా సర్పంచ్ భర్త వెంకటేశ్వర్లు తీర్మానం, ఇతర రికార్డులను తీసుకుని ఇంటికి వెళ్లాడు. దాంతో ఆగ్రహించిన గ్రామస్తులు, వార్డు సభ్యులు సర్పంచ్ భర్త రికార్డులు ఎలా తీసుకెళ్తాడని జీపీ సెక్రెటరీ రమేశ్​ను, కారోబార్ ఉప్పలయ్యను నిలదీశారు. అనంతరం జీపీ బిల్డింగ్​లో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పై ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తామని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.