నోటీసు ఇచ్చే అధికారం సర్పంచ్ కు లేదు: హైకోర్టు

నోటీసు ఇచ్చే అధికారం సర్పంచ్ కు లేదు: హైకోర్టు

గ్రామ పంచాయతీ చేసే తీర్మానానికి అనుగుణంగా నోటీసు ఇచ్చే అధికారం పంచాయతీ సెక్రటరీకి మాత్రమే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రహరీ గోడను కూల్చేయాలని సర్పంచ్‌‌ నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌ మండలం నానాజీపూర్‌‌ కు చెందిన వి.రాఘవరెడ్డి వేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పంచాయతీ తీర్మానాన్ని కార్యదర్శి ద్వారా అమలు చేయించాలని, సెక్షన్‌‌ 32 ప్రకారం సర్పంచ్‌‌కు అధికారం లేదని పిటిషనర్ తరఫున లాయర్‌‌ వాదించారు. పంచాయతీ చట్టం 90, 92 సెక్షన్లకు అనుగుణంగానే సర్పంచ్‌‌ నోటీసులు ఇచ్చారని ప్రభుత్వం తరఫు లాయర్ ప్రతివాదన వినిపించారు. పిటిషనర్ తరపు లాయర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీ కమిషనర్‌‌ చట్టంలోని 42 సెక్షన్‌‌కు లోబడి సెక్రటరీని నియమిస్తారని, పంచాయతీ స్థిర, చరాస్తులను కాపాడాల్సింది సెక్రటరీనే కాబట్టి పంచాయతీ తీర్మాన నోటీసు ఇచ్చే అధికారం కూడా ఆయనదే అవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం చల్లా తీర్పు చెప్పారు.