
- సీఎం పర్యటన సమయంలో జడ్చర్లలో భారీ బందోబస్తు
- కాన్వాయ్‌ని సర్పంచ్‌లు అడ్డుకోవచ్చన్న ఇంటెలిజెన్స్
- ముందస్తుగా మీటింగ్ ప్రాంతంపై నిఘా పెట్టిన పోలీసులు
- ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్‌లు.. రాస్తారోకో
- సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు.. ఆందోళన
- జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలని డిమాండ్
జడ్చర్ల, వెలుగు: సీఎం పర్యటన నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల తీరు ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎక్కడ సీఎం కాన్వాయ్‌కు సర్పంచ్‌లు అడ్డుతగులుతారోనని ముందుస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్పంచ్ల మీటింగ్ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సీఎం పర్యటన ముగిసేదాకా వారిని బయటకు రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్‌లకు కలిపి జాయింట్ చెక్ పవర్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కొన్నాళ్లుగా సర్పంచ్‌లు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించేందుకు శుక్రవారం జడ్చర్లలోని ప్రేమ్రంగ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో జిల్లా సర్పంచ్‌లు సమావేశమయ్యారు. ఇదే సమయంలో వనపర్తి జిల్లా కేంద్రంలో మంత్రి నిరంజన్‌రెడ్డిని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లారు. ఆయన తిరుగు ప్రయాణంలో సర్పంచ్ల సంఘం అడ్డుకునే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్సూచనల మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రేమ్రంగ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ వద్ద ఉదయం నుంచే భారీగా మోహరించారు. సర్పంచ్‌లను బయటకు రాకుండా గేటు వద్దే నిలువరించారు. దీనిపై సర్పంచ్‌లు మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కాన్వాయ్ వెళ్లిన తర్వాత పోలీసులు గేటును ఓపెన్ చేయడంతో సర్పంచ్‌లు ర్యాలీగా జడ్చర్ల సిగ్నల్గడ్డపైకి చేరుకున్నారు. అక్కడ రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం హైదరాబాద్–-కర్నూలు జాతీయ రహదారి వైపు సర్పంచ్‌లు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అటు తర్వాత వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు.
జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాల్సిందే
ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశమైన సర్పంచ్‌లు భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌కు నిధుల వినియోగంలో జాయింట్ చెక్ పవర్‌ను కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. జాయింట్ చెక్ పవర్ కల్పించడం వల్ల గ్రామాల్లో రాజకీయ గొడవలు వస్తాయని, దీని ప్రభావం గ్రామాల అభివృద్ధిపై పడుతుందని మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ప్రణీల్ చందర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పరిధిలోని అనేక గ్రామాల సర్పంచ్‌లు, పలువురు మద్దతు దారులు పాల్గొన్నారు.