ఫండ్స్ ఇవ్వకుండా పనులెట్ల?.. సర్పంచ్‌ల రాజీనామాలు

V6 Velugu Posted on Aug 27, 2021

ప్రభుత్వం స్కూల్స్ క్లీనింగ్ బాధ్యతను సర్పంచ్ లకు అప్పజెప్పడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికార పార్టీకి ఒక్కసారిగా గ్రామ సర్పంచులు షాక్ ఇస్తున్నారు. గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకపోవడంతో ఒక్కసారిగా 24 మంది సర్పంచులు రాజీనామాలు చేశారు. కొమురం భీం జిల్లా వాంకిడి మండలానికి చెందిన సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి తమ నిరసనను తెలియజేశారు.

మరో వైపు పల్లె ప్రగతి పనులతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సర్పంచులు, పంచాయతీ సిబ్బందికి.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పజెప్పిన స్కూళ్ల శానిటైజేషన్‍ బాధ్యతలు తలనొప్పిగా మారాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా ఏడాదిన్నరగా సర్కారు బడి గంట కొట్టకపోవడంతో.. క్లాస్​ రూములన్నీ బూజుపట్టాయి. టాయిటెట్లు కంపుకొడుతున్నాయి. స్కూల్‍ ఆవరణలు చెత్త చెత్తగా మారాయి. సెప్టెంబర్​ 1 నుంచి స్కూళ్లు స్టార్టవుతున్నందున ఈ నెల 30 వరకు స్కూళ్లను క్లీన్​ చేసే బాధ్యతను సర్పంచ్​లకు, మున్సిపల్​ చైర్మన్లకు సర్కారు అప్పజెప్పింది. అయితే.. ఈ పనులన్నీ చేయడానికి గవర్నమెంట్‍ ఎటువంటి స్పెషల్‍ స్టాఫ్, ఫండ్స్​ ఇవ్వట్లేదు.  ప్రస్తుత గ్రామ పంచాయతీ బడ్జెట్‍, మ్యాన్​ పవర్‍తోనే  డైలీ స్కూల్‍ మెయింటనెన్స్​ చూసుకోవాలని చెప్తోంది.

చాలిచాలని నిధులు.. పల్లెప్రగతి పనులు

గ్రామ పంచాయతీలకు కేంద్ర 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చే నిధులే దిక్కు. ఊరు జనాభా ఆధారంగా జీపీలకు 50:50  నిష్పత్తిలో ఏటా ఒక్కో వ్యక్తికి రూ. 1,600 చొప్పున ఫండ్స్​ ఇస్తున్నారు. ఈ లెక్కన 500 మంది ఉండే గ్రామానికి రూ. 8 లక్షలు వస్తాయి. ఇందులోనుంచే శానిటేషన్‍, కరెంట్‍ బిల్లులు, సిబ్బంది జీతాలు, ట్రాక్టర్ల ఈఎంఐలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పైప్‍లైన్‍ లీకేజీ పనులు, మంచినీటి ట్యాంకుల క్లీనింగ్‍ వంటి ఇంకా ఎన్నో పనులు  ఖర్చు చేసుకోవాలి. కాగా, ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్‍ చాలకపోవడంతో.. పలు అభివృద్ధి పనులకు సర్పంచులు దాతల సాయం కోరుతున్నారు. ఇదిచాలదన్నట్లు వారికి కొత్తగా పల్లె, పట్టణ ప్రగతి టార్గెట్లు ఇచ్చారు.

పంచాయతీలకు అంతంత మాత్రమే స్టాఫ్​

ప్రస్తుతం ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో ముగ్గురు నుంచి నలుగురు కార్మికులు పని చేస్తున్నారు. రెగ్యులర్‍ విలేజ్‍ శానిటేషన్‍, దోమల స్ప్రే, కరెంట్‍ రిపేర్లు, నల్లా పైపుల లీకేజీలు, మంచినీటి ట్యాంకులు క్లీనింగ్‍, ట్రాక్టర్‍ డ్రైవింగ్‍ ఇతరత్రా పనులు చేయడానికే వీరి సేవలు చాలట్లేదు. ఈ క్రమంలో కరోనా కేసులు పెరగకుండా డైలీ స్కూల్‍ ఆవరణలు, క్లాస్‍ రూంలు శానిటైజేషన్‍  బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో సర్కారు బడుల్లో  క్లీనింగ్‍ పనులకు స్వచ్ఛ కార్మికులు ఉండేవారు. వారికి నెలకు రూ. 2,500 నుంచి 3 వేలు  చెల్లించేవారు. విద్యాశాఖలో ప్రస్తుతం స్వచ్ఛ కార్మికులను పక్కనపెట్టారు. పంచాయతీల్లో పనిచేసే కార్మికులతోనే స్కూళ్లను క్లీన్​ చేయించాలని చెప్తున్నారు. ఇప్పటికే చాలీచాలని సిబ్బందితో గ్రామ పనులతో తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నామని, ఇప్పుడు అదనంగా స్కూళ్ల పనులేందని పంచాయతీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

Tagged FUNDS, state, schools, Sarpanches, resigns, Staff, funds

Latest Videos

Subscribe Now

More News