- అభివృద్ధి కోసమంటూ అధికార పార్టీలో చేరుతున్న సర్పంచ్‌లు
- రెండు విడతల్లో కలిపి 400 మందికి పైగా ఇండిపెండెంట్లు విజయం
- తమ పార్టీల్లోకి రావాలంటూ పలుచోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేల ఆఫర్లు
కరీంనగర్, వెలుగు : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచి, విజయం సాధించిన సర్పంచ్‌లు కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలను కొనసాగించుకునేందుకు వీలుగా అధికార పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఇండిపెండెంట్ సర్పంచ్‌లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మరికొందరు సైతం అదే బాటలో నడుస్తున్నారు. ఇంకొందరు సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేశాక.. అనుచరులతో చర్చించి పార్టీలో చేరాలని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఖాతాలో మరిన్ని సర్పంచ్ స్థానాలు పడే అవకాశం కనిపిస్తోంది.
400 మందికి పైగా...
రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు విడతల్లో కలిపి 8,566 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ మద్దతుతో 5,246 మంది సర్పంచ్‌లు విజయం సాధించారు. బీఆర్‌ఎస్ మద్దతుతో 2,329 మంది, బీజేపీ మద్దతుతో 500 మంది గెలువగా.. ఇండిపెండెంట్లుగా 467 మంది సర్పంచ్ స్థానాలు దక్కించుకున్నారు. వీరిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ రెబల్స్‌తో పాటు సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, న్యూడెమోక్రసీ వంటి లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు కూడా ఉన్నారు. లెఫ్ట్ పార్టీలు మినహా పూర్తిగా ఇండిపెండెట్లుగా గెలిచిన సర్పంచులు 400 మందికిపైగా ఉంటారని అంచనా. ఇప్పుడు వీరంతా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.
ఇప్పటికే చేరిన పలువురు సర్పంచ్‌లు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఇండిపెండెంట్లుగా గెలిచిన గర్శకుర్తి సర్పంచ్ చిందం ఆంజనేయులుతో పాటు 12 మంది వార్డు మెంబర్లు, ఇస్లాంపూర్ సర్పంచ్ బారాజు ప్రభాకర్‌రెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇదే మండలంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన లింగంపల్లి సర్పంచ్ ఈటవేని శ్రీనివాస్, చొప్పదండి మండలం మంగళపల్లి సర్పంచ్ పెద్దెల్లి శారద కూడా కాంగ్రెస్ లో చేరారు.
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో ఇండిపెండెంట్‌గా గెలిచిన బూరుగుపల్లి సర్పంచ్ చిన్న సాయిలు సోమవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ సర్పంచ్‌గా ఎన్నికైన ఎర్ర భవానీ నవీన్‌కుమార్ సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి సర్పంచ్ చిలుక బాబు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పెగ్గర్ల సర్పంచ్ కుంటల లక్ష్మి, తుర్తి సర్పంచ్ నాయిని గౌతమి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో, మెట్‌పల్లి మండలం మేడిపల్లి సర్పంచ్ కడారి రాజేశ్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
సంగారెడ్డి జిల్లా అంధోల్ మండలంలో ఇండిపెండెంట్‌గా గెలిచిన అన్నసాగర్ సర్పంచ్ సింగూర్ మల్లీశ్వరి మంత్రి దామోదర రాజనర్సింహ కూతురు, కాంగ్రెస్ నాయకురాలు త్రిష సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీలోకి రావాలంటూ ఆఫర్లు
గ్రామపంచాయతీల్లో గెలిచిన ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ఇన్‌చార్జులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గ్రామంలో వివిధ డెవలప్‌మెంట్ వర్క్స్‌కు నిధులు ఇస్తామని, పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఓ అడుగు ముందుకేసి.. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏ పార్టీ సర్పంచ్‌లైనా బీజేపీలో చేరితే కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచ్‌లు నామోషీ అయ్యేలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ నెల 18లోపు వచ్చిన వారినే చేర్చుకుంటామని డెడ్‌లైన్ సైతం విధించారు.
