హుజూర్‌నగర్‌ బరిలోకి సర్పంచ్‌లు, లాయర్లు

హుజూర్‌నగర్‌ బరిలోకి సర్పంచ్‌లు, లాయర్లు

నామినేషన్లు వేయనున్న
251 మంది సర్పంచ్‌లు

ఇంటింటికి తిరిగి టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం
రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్‌
‘హలో సర్పంచ్..చలో హుజూర్ నగర్’కు పిలుపు

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల బరిలోకి సర్పంచ్‌లు, లాయర్లు దిగుతున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో 251 మంది సర్పంచ్‌లు నామినేషన్లు వేయనున్నట్టు రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు సౌధాని భూమన్న యాదవ్ బుధవారం వెల్లడించారు. సర్పంచ్‌ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకు నిరసనగానే పోటీలోకి దిగుతున్నట్టు పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలో ఇంటింటికి వెళ్లి టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసి సర్పంచ్‌ల సత్తా చూపిస్తామన్నారు. ‘హలో సర్పంచ్.. చలో హుజూర్ నగర్’ నినాదంతో ఎలక్షన్లలో పాల్గొంటామన్నారు. జాయింట్ చెక్ పవర్ తొలగించకపోవడం, రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన 29 అధికారాలను ఇవ్వకపోవడం, సర్పంచులుగా ఎన్నికై 9 నెలలైనా ఇంత వరకు నిధులు విడుదల చేయకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందన్నారు.

గత నెల 3న సర్పంచులంతా సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు వెంటనే రూ.100 కోట్లు పంచాయతీలకు విడుదల చేస్తామన్నారని, ఇంతవరకు విడుదల చేయలేదని భూమన్న యాదవ్ అన్నారు. హరితహారం మొక్కలు చనిపోయినా, మేకలు తిన్నా దానికి బాధ్యులను చేసి సస్పెండ్‌ చేస్తామని బెదిరించడంతో సర్పంచ్‌ల ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్నారు. యాక్షన్ ప్లాన్‌లో పాల్గొనకుంటే చెత్త బుట్టలతో సన్మానం చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అవమానిస్తున్నారన్నారు. సర్పంచ్‌ల సమస్యలు పరిష్కరించాలని, జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలని సర్పంచ్‌ల సంఘం నేతలు మాజీ మంత్రి డీకే అరుణ నేతృత్వంలో ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

లాయర్లంతా నామినేషన్లు: బార్ ఆసోసియేషన్

న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో రాజకీయ నాయకులు వివక్ష చూపడం తగదని బార్ అసోసియేషన్ అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాస రావు అన్నారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి దరఖాస్తుల కోసం న్యాయవాదులంతా బుధవారం రిటర్నింగ్ అధికారి ఆఫీస్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస రావు మాట్లాడుతూ గతంలో మేళ్ళచెర్వు, చింతలపాలెం పోలీస్‌ స్టేషన్లకు సంబంధించిన  సివిల్, క్రిమినల్ కేసులు హుజుర్ నగర్ కోర్టు పరిధిలో ఉండేవని, వాటిని ఇటీవల కోదాడ కోర్టు పరిధికి బదిలీ చేశారన్నారు. దీంతో కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.