ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

జన్నారం, వెలుగు:మండలంలోని రాంపూర్​ గ్రామపంచాయతీలో శనివారం హరితహారం మొక్కల విషయంలో సర్పంచ్ భర్త అల్గనూరి రవి, సెక్రటరీ హనుమాండ్ల గంగరాజం గొడవపడ్డారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పరస్పరం దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న సర్పంచ్ సులోచనను సెక్రటరీ తోసెయ్యడంతో ఆమె కిందపడ్డది. అనంతరం సులోచన మీడియాతో మాట్లాడుతూ సెక్రటరీపై పలు ఆరోపణలు చేశారు. విధి నిర్వహణలో భాగంగా తాను పంచాయతీకి వెళ్లినప్పుడల్లా గంగరాజం కులం పేరుతో చులకనగా మాట్లడమే గాకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. శనివారం హరితహారం మొక్కల వివరాలు అడిగానని, గంగరాజం కోపంతో తనను కులం పేరుతో బూతులు తిడుతూ దాడి చేశాడని పేర్కొన్నారు. అక్కడే ఉన్న తన భర్త రవి అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆయనపైనా దాడి చేశాడని చెప్పారు. తనను కులం పేరుతో దూషించి దాడి చేసిన కార్యదర్శి గంగరాజంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్సై సతీష్​ను వివరణ కోరగా, సర్పంచ్ సులోచన ఫిర్యాదు మేరకు గంగరాజంపై అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  

పార్టీ మారేది లేదు

నిర్మల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. శనివారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ తో కలిసి తన నివాసంలో రాజీవ్ గాంధీ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు జాతీయస్థాయి పదవి ఇచ్చి గౌరవించిందన్నారు. టీఆర్ఎస్, బీజేపీల తప్పుడు మాటలు విని జనాలు విసిగిపోయారన్నారు.ఈ రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్​పార్టీ కార్యకర్తలు, అనుచరులు గందరగోళానికి గురికావొద్దన్నారు. డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్, జడ్పీటీసీ రమణారెడ్డి, లీడర్లు జమాల్, ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరద బాధిత పిల్లలకు స్కూల్ కిట్స్ అందజేత

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసీ కాలనీ, పద్మశాలి కాలనీ, గణేష్ నగర్​, పాత మంచిర్యాలకు చెందిన వరద బాధిత కుటుంబాల్లోని 200 మంది పిల్లలకు సేవ సహయోగ్ ఫౌండేషన్ సహకారంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు స్కూల్ బ్యాగులు, బుక్స్ అందించారు. ప్రభుత్వం స్పందించి వరద బాధితులకు పరిహారం చెల్లించాలన్నారు. సేవా భారతి సభ్యులు రజిని, లీడర్లు రజినీష్ జైన్, వెంకటేశ్వర్​రావు, మల్లేష్, ప్రభాకర్, బియ్యాల సతీష్​రావు పాల్గొన్నారు.  

హిందు సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలి

కాగజ్ నగర్, వెలుగు: హైందవ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలని బీజేపీ సీనియర్​లీడర్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్​చార్జి మురళీధర్ రావు కోరారు. శనివారం కాగజ్​నగర్​లోని వినయ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన డిజిటల్ హిందూ కంక్లేవ్ సదస్సులో ఆయన మాట్లాడారు. హిందూ సంస్కృతి , సంప్రదాయాలు వేల సంవత్సరాల క్రితం నాటివన్నారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచానికే ఆదర్శమన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం సోషల్​మీడియా వాడాలన్నారు. మన జీవితంలో సోషల్ మీడియా సూపర్ పవర్ గా మారిందన్నారు. మహారాష్ట్ర లీడర్​దేవాంగ్ దేవ్ మాట్లాడుతూ హిందూ మతం ఔనత్యం, గొప్పతనాన్ని చాటిచెప్పాలన్నారు. బీజేపీ మైండ్ మీడియా హెడ్ దేవికారెడ్డి మాట్లాడుతూ బీజేపీపై కాంగ్రెస్, టీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, తాలుకా లీడర్​డాక్టర్ హరీశ్​బాబు, ఆత్మరాం నాయక్, గోలెం వెంకటేశ్, వీరభద్రచారి, ఈర్ల విశ్వేశ్వరరావు, సిందం శ్రీనివాస్, ధోని శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దహనం

ఇచ్చోడ, వెలుగు: బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆర్ఎస్ఎస్​పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ మండల అధ్యక్షుడు కేంద్ర నారాయణ పేర్కొన్నారు. శనివారం ఇచ్చోడ శివాజీ చౌక్ వద్ద ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరసనలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడె మానాజి, జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మడి భీంరెడ్డి, మాధవరావు, అసెంబ్లీ కన్వీనర్ కదం బాబా రావు, మండల ప్రధాన కార్యదర్శి రమేశ్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చ నారాయణ  పాల్గొన్నారు.

ఆదిలాబాద్​లో..

ఆదిలాబాద్, వెలుగు: ఆర్ఎస్ఎస్ పై బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదిలాబాద్​లో ఆయన ఆయన ఇంటిని ముట్టడించారు. దీంతో పోలీసులు కార్యకర్తలను అడ్డుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు

‘తప్పుడు ఆరోపణలు మానుకోవాలి’

ఖానాపూర్,వెలుగు: ప్రజా సమస్యలపై మున్సిపల్ కౌన్సిలర్లు, లీడర్లు ఉద్యమాలు చేస్తే, వారిపై అధికార పార్టీ కౌన్సిలర్లు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం ఫైర్​అయ్యారు. శనివారం ఖానాపూర్ మున్సిపల్ ఆఫీసు ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కౌన్సిలర్లు, లీడర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఖానాపూర్ మున్సిపాలిటీకి కేవలం 42 పెన్షన్లు మంజూరు కావడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మహిళలతో కలిసి ఆందోళన చేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన వారికి పెన్షన్లు రాకుండా చేసిన ఆఫీసర్లకు వత్తాసు పలకడం దారుణమన్నారు. పెన్షన్​కోసం దరఖాస్తు చేసుకున్న వారితో కలిసి ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామన్నారు. సమావేశంలో కౌన్సిలర్ జి.కిశోర్ నాయక్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయిని సంతోష్, లీడర్లు అమానుల్లా ఖాన్, షబ్బీర్ పాషా తదితరులు ఉన్నారు.

టీచర్ల సమస్యల పరిష్కారంలో సర్కారు ఫెయిల్​ 

మంచిర్యాల, వెలుగు: టీచర్ల సమస్యలను పరిష్కరించడంలో సర్కారు ఫెయిలైందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ర్ట అధ్యక్షుడు కానుగంటి హన్మంతరావు విమర్శించారు. మంచిర్యాలలోని శిశుమందిర్​ స్కూల్​లో శనివారం నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 18 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. తపస్​ ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 317 జీవో రద్దు విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. టీచర్ల సమస్యల విషయంలో సర్కారు ఏమీ చేయకపోగా అంతా చేస్తున్నామనే భ్రమ కల్పిస్తోందన్నారు. సీపీఎస్​ రద్దుకు, టీచర్ల ప్రమోషన్ల కోసం పోరాడుతామన్నారు. కార్యక్రమంలో ఎంఈవో జాడి పోచయ్య, విద్యాశాఖ స్పెషల్​ అధికారి చౌదరి, శిశుమందిర్ విభాగ్ అధ్యక్షుడు డాక్టర్ విష్ణువర్దన్​రావు, తపస్ రాష్ర్ట, జిల్లా నాయకులు బండి రమేష్, బగ్గని రవికుమార్, సయింపు శ్రీనివాసరావు, చీర సమ్మయ్య, నీలేష్​కుమార్ తదితరులు పాల్గొన్నారు.  

చిన్నారికి అరుదైన ట్రీట్​మెంట్​ 

మంచిర్యాల, వెలుగు:  జిల్లాకేంద్రంలోని పల్లవి హాస్పిటల్​లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి అత్యవసర పరిస్థితుల్లో అందించిన వైద్యం విజయవంతమైందని డాక్టర్లు సాయిశ్రీజ, రాజు తెలిపారు. ఆసిఫాబాద్​కు చెందిన రాణి, దివాకర్​ దంపతుల 7 నెలల కుమారుడు చక్రికి గుండె వేగం, బీపీ లెవల్స్​ పెరిగి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్​కు వచ్చారన్నారు. మూడు రోజులుపాటు ఆధునిక పరికరాలు, మందులతో ప్రత్యేక చికిత్స అందించడంతో సాధారణ స్థితికి చేరుకున్నాడని వివరించారు. తమ హాస్పిటల్​లో పేదలకు తక్కువ ఖర్చుతోనే 24 గంటలు మెరుగైన వైద్యం అందిస్తున్నామని 
పేర్కొన్నారు.  

స్టూడెంట్స్​కు క్వాలిటీ ఫుడ్ ​ఇవ్వాలి

ఆదిలాబాద్,వెలుగు: రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్స్​ అందించాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి కోరారు. శనివారం ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిల్లో  వైరల్ ఫివర్​తో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. రికార్డులు, వంట సామగ్రిని పరిశీలించారు. అనంతరం చించుఘాట్ కుంటాల రెసిడెన్షియల్​స్కూల్​ను తనిఖీ చేశారు. క్వాలిటీ ఎడ్యుకేషన్​తో పాటు  పౌష్టికాహారం అందించాలన్నారు. ఆయన వెంట డీఏంహెచ్​వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.

నేటి నుంచి కేంద్ర మంత్రి రూపాల్​ పర్యటన

ఆదిలాబాద్/​నిర్మల్,వెలుగు: కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటనను సక్సెస్​చేయాలని బీజేపీ ఆదిలాబాద్, నిర్మల్​జిల్లాల అధ్యక్షులు పాయల్​శంకర్, రమాదేవి కోరారు. ఈనెల 22, 23 తేదీల్లో ఆదిలాబాద్​జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. 21న నిర్మల్, 22న ఆదిలాబాద్, 23న బోథ్ నియోజకవర్గంలో పర్యటిస్తారని వివరించారు. పార్టీ పటిష్టత, అంతర్గత సమావేశాలు, కేంద్ర పథకాలపై రివ్యూలు ఉంటాయన్నారు. ఆదివారం 4.30 గంటలకు నిర్మల్ కొయ్య బొమ్మల కేంద్రం, రాంజీ గోండ్ స్తూపాన్ని సందర్శిస్తారన్నారు. సాయంత్రం అంబేద్కర్ భవన్ లో జరిగే మత్స్యకారుల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతారన్నారు. సమావేశంలో లీడర్లు వేణు గోపాల్, ఆధినాథ్, లాలా మున్న, దినేశ్​మాటోలియ, జోగు రవి, ముకుంద్, రావుల రామ్​నాథ్, అయ్యన్న గారి భూమయ్య, మెడిసెమ్మ రాజు, డాక్టర్ మల్లికార్జున్​రెడ్డి, అలివేలు, కొరిపెల్లి శ్రావణ్ రెడ్డి, రజిని, సాదం అర్వింద్,అల్లం భాస్కర్ తదితరులు ఉన్నారు.