
- రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్
మహబూబాబాద్, వెలుగు: బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే, జాటోత్ రామచంద్రునాయక్ సూచించారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కురవి రోడ్డులో ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బహుజన కులాలను ఏకం చేసి కిలాషాపురం నుంచి గోల్కొండ కోటను జయించే వరకు తన జైత్రయాత్ర కొనసాగించినట్లు పేర్కొన్నారు.
పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంకుబండ్ పై ఏర్పాటు చేసే విధంగా తమ వంతు సహకారం ఉంటుందన్నారు. పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు కమిటీ అధ్యక్షుడు జెర్రిపోతుల వెంకన్న గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ మాజీ ఎంపీ మాలోత్ కవిత, డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి పాల్గొన్నారు.