ఇంటినుంచి బయటికొచ్చి.. సొంతంగా బేకరి పెట్టి..

ఇంటినుంచి బయటికొచ్చి.. సొంతంగా బేకరి పెట్టి..

దేశంలో పద్దెనిమిదేండ్ల వయసు నుంచి నలభై ఐదేండ్ల వయసున్న ముప్పై శాతం మంది మహిళలు రోజూ ఏదో ఒకరకంగా గృహ హింసకు గుర​వుతున్నారు. అయితే, నాలుగ్గోడల మధ్య ఆ హింస భరించడం కంటే బయటకు అడుగుపెట్టి స్వేచ్ఛగా బతకాలి అనుకుంది ఈమె. ఇంటినుంచి బయటికొచ్చి సొంతంగా బేకరి పెట్టి తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తోంది మహారాష్ట్రకు చెందిన సర్వత్‌‌.

సర్వత్‌‌ గులంకార్‌‌‌‌ భగ్వన్‌‌ సొంతూరు మహారాష్ట్రలోని సతారా. తండ్రి హోంమేడ్‌‌ ఫుడ్‌‌ ఐటమ్‌‌ డిస్ట్రిబ్యూటర్‌‌‌‌గా పని చేసేవాడు. చిన్న వయసులోనే సర్వత్‌‌కు పెండ్లి చేశారు తల్లిదండ్రులు. పెండ్లైన కొన్ని రోజులకే భర్త వేధింపులు మొదలయ్యాయి. అయినా, ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. అన్నింటినీ తట్టుకుంది. కొన్నాళ్లకు సర్వత్‌‌కు ఆడపిల్ల పుట్టింది. అప్పటినుంచి వేధింపులు ఇంకా పెరిగాయి. ‘ఆడపిల్లని కంటావా?’ అని కొట్టేవాడు భర్త. ఆ వేధింపులు భరించలేక బిడ్డతో సహా ఆ ఇంటినుంచి బయటికొచ్చేసింది. పుట్టింటికొచ్చి తండ్రి ఫుడ్‌‌ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌‌లో సాయపడటం మొదలుపెట్టింది.  

కుకీస్‌‌కి ఫేమస్‌‌

కొన్నాళ్లకు సర్వత్‌‌ తండ్రికి గుండెపోటు వచ్చింది. దాంతో ఆయనకు రెస్ట్‌‌ అవసరం అన్నారు డాక్టర్లు. ఇక చేసేదేం లేక తనే బిజినెస్‌‌ నడిపించడం మొదలుపెట్టింది. అది చూసి చుట్టు పక్కలవాళ్లు ‘నీ వల్లే మీ నాన్నకు ఇలా జరిగింది. భర్తని వదిలేసి, ఆడపిల్లతో ఎలా బతుకుతానని  అనుకున్నావు? ఏ రోజుకైనా మళ్లీ అత్తారింటికే వెళ్లాలి నువ్వు’ అనేవాళ్లు. అలా మాట్లాడే వాళ్లకు గట్టి సమాధానం చెప్పాలనుకుంది సర్వత్‌‌. అప్పుడే ‘వేరేవాళ్ల ఫుడ్‌‌ ప్రొడక్ట్స్ అమ్మడం ఎందుకు. నువ్వే తయారుచేసి అమ్మొచ్చు కదా’ అని బంధువులు సలహా ఇచ్చారు. దాంతో బేకరీ బిజినెస్ పెట్టాలనుకుంది. అందుకు కొన్ని రోజులు కోచింగ్‌‌ తీసుకుంది. ఆ తరువాత బేకరి పెట్టేందుకు బ్యాంక్‌‌ నుంచి లోన్‌‌ తీసుకుంది. ‘మరియా బేకర్స్‌‌ అండ్‌‌ ఫుడ్స్‌‌’ పేరుతో బిజినెస్‌‌ స్టార్ట్‌‌ చేసింది. కేక్స్‌‌, పఫ్స్‌‌, బ్రెడ్, కుకీస్‌‌ ఇలా అన్ని రకాల ఐటమ్స్‌‌ అమ్ముతోంది. వాటన్నింటిలో ‘నాన్‌‌ఖటై’(కుకీస్‌‌) చాలా ఫేమస్‌‌. ఇవి రోజుకి 20 కిలోల వరకు అమ్ముడుపోతాయట. చాలామంది ఈ కుకీస్‌‌ను విదేశాల్లో ఉన్న బంధువులకు, స్నేహితులకు పంపిస్తుంటారు. అన్ని ఖర్చులు పోను నెలకి లక్ష రూపాయల వరకు సంపాదిస్తోంది సర్వత్‌‌. కెఫె, చాట్‌‌ సెంటర్ పెట్టే ఆలోచనలో ఉన్నా అంటోంది సర్వత్‌‌.

‘నేను వేధింపులు భరిస్తూ, ఆ ఇంట్లోనే ఉంటే ఎప్పటికీ పైకి రాలేకపోయేదాన్ని. నా బిడ్డ ఇప్పుడు డాక్టర్‌‌‌‌ కోర్స్​ చదువుతోంది. అక్కడే ఉంటే ఆ చదువుకూ దూరమయ్యేది. ఆడవాళ్లు ఒకరిమీద ఆధారపడి బతకడం మానేయాలి. ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడాలి. బతకగలం అనే నమ్మకంతో ముందడుగు వేయాలి’ అంటుంది సర్వత్‌‌.