గ్లాస్గో: ఇండియా స్టార్ హైజంపర్, నేషనల్ రికార్డు ప్లేయర్ సర్వేష్ కుషారే కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించాడు. సోమవారం రాత్రి జరిగిన మెన్స్ హైజంప్ ఫైనల్లో సర్వేష్ 2.25 మీటర్ల ఎత్తు నుంచి దూకి సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ క్రీడాంశంలో రజతం సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. హోరాహోరీగా జరిగిన పోరులో రోమైన్ బెక్ఫర్డ్ (జమైకా) కూడా 2.25 మీటర్ల ఎత్తు నుంచే దూకాడు.
ఆ తర్వాత ఇద్దరూ 2.28 మీటర్ల ఎత్తును దాటడంలో విఫలమయ్యారు. అయితే తక్కువ ప్రయత్నాల్లో ఆ ఎత్తును ప్రయత్నంచిన జమైకా అథ్లెట్‌కు గోల్డ్ లభించగా, కుషారే సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు. ఇంగ్లండ్ అథ్లెట్ జాక్ కిమాని (2.20 మీటర్లు) కాంస్యం నెగ్గాడు. ఇండియాకు చెందిన ఆదర్ష్ రామ్ జ్యోతి శంకర్ (2.15 మీటర్లు) ఐదో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో తేజస్విన్ శంకర్ కాంస్యం సాధించాడు.
ఇప్పుడు కుషారే రజతంతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఈసారి కూడా బరిలోకి దిగిన తేజస్విన్ తొలి ప్రయత్నంలో 2.05 మీటర్ల ఎత్తును అధిగమించలేక పోటీనుంచి తప్పుకున్నాడు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా దేవర్‌గావ్ గ్రామానికి చెందిన ఉల్లిపాయ రైతు కుమారుడైన కుషారే, తన తండ్రి మరియు చిన్ననాటి కోచ్‌తో కలిసి మొక్కజొన్న పొట్టు, పత్తి, వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసిన తాత్కాలిక ల్యాండింగ్ పిట్‌లను ఉపయోగించి హైజంప్ సాధన చేసేవాడు.
