
- బీసీసీఐకి లేఖ రాస్తాం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అవినీతిలో మునిగి జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆటగాళ్లను పట్టించుకోవడం లేదని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్ కె. శివసేనా రెడ్డి అన్నారు. హెచ్‌సీఏ కారణంగా జిల్లాలో క్రికెట్ అభివృద్ది కుంటుపడిందని, ప్రతిభావంతులైన గ్రామీణ క్రికెటర్లకు అవకాశాలు లభించడం లేదన్నారు. ఈ విషయంపై బీసీసీఐకి లేఖ రాస్తామని ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన 'తెలంగాణ క్రికెట్ దశ-దిశ' రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పారు.
జిల్లాల్లో క్రికెట్ అభివృద్దికి ముందుకొచ్చిన తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ)ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇక, రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ది చెందాలంటే అత్యాధునిక సదుపాయాలతో కూడిన అకాడమీలు ప్రతి జిల్లాలో అవసరమని టీడీసీఏ ప్రెసిడెంట్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్టేట్ టీమ్ అంటే హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాదని, ప్రతి జిల్లా నుంచి క్రికెటర్లకు ప్రాతినిథ్యం ఉండాలన్నారు . అందుకు టీడీసీఏ తరఫున కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీసీఏ జిల్లా సంఘాల ప్రతినిధులు, మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు.