లాహోర్​లోనే హఫీజ్ మకాం.. ఇంటి చుట్టూ సైనికులతో పటిష్ట భద్రత

లాహోర్​లోనే హఫీజ్ మకాం..  ఇంటి చుట్టూ సైనికులతో పటిష్ట భద్రత
  • హఫీజ్ జైల్లో ఉన్నాడంటూ పాక్​ బుకాయింపు
  • అత్యంత సౌకర్యవంతమైన జీవితం

న్యూఢిల్లీ: లష్కరే తోయిబా చీఫ్, 26/11 ముంబై దాడుల మాస్టర్​మైండ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్ లాహోర్​లోని జోరమ్‌‌ తౌమ్‌‌ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వం అతనికి గట్టి భద్రత కల్పిస్తున్నది. ఇటీవల జమ్మూ కాశ్మీర్​లోని పహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్​లోనూ హఫీజ్ హస్తం ఉన్నది. అత్యంత సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నాడు. ఇంటి కింద ఓ బంకర్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. 

సాధారణ పౌరుడి మాదిరిగానే జోరమ్ తౌమ్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సయీద్ ఉంటున్న జోరమ్ తౌమ్ అత్యంత రద్దీ ప్రాంతం. హఫీజ్ సయీద్ తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ నివాసం ఉంటున్నట్లు తెలుస్తున్నది. ఇంటి చుట్టూ పాకిస్తాన్  ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది. శాటిలైట్ ఫొటోలు, వీడియోలు కూడా హఫీజ్ కదలికలను గుర్తించాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బలగాలతో పాటు హఫీజ్ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా 24/7 అతనికి భద్రత కల్పిస్తుంటుంది. 

అతని ఇంటికి ఆనుకొని మసీదు, మదర్సా ఉంది. ముందర స్పెషల్ పార్క్​ను ఏర్పాటు చేశారు. హఫీజ్ సయీద్ అసలు పాకిస్తాన్​లోనే లేడని అక్కడి నేతలు బుకాయిస్తున్నారు. టెర్రరిస్టులకు నిధులు సమకూర్చాడన్న ఆరోపణల నేపథ్యంలో అతనిపై కేసు నమోదైంది. కోర్టు అతనికి 31 ఏండ్ల జైలు శిక్ష విధించిందని, అతడు జైల్లోనే ఉన్నాడంటూ పాకిస్తాన్ బుకాయిస్తున్నది. కానీ.. అతడు మాత్రం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోలో స్పష్టమవుతున్నది. 

హఫీజ్ సయీద్ లాహోర్​లోనే ఉంటున్నాడని ఇండియన్ ఏజెన్సీలు ముందు నుంచి చెప్తున్నాయి. హఫీజ్ సయీద్ అత్యంత సన్నిహితుడు అబు ఖతల్.. హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి పాక్ గవర్నమెంట్ అతనికి సెక్యూరిటీ మరింత పెంచింది. అతడి ఇంటినే సబ్‌‌జైలుగా మార్చినట్లు వార్తలు వినిపించాయి. ఇండియాలో మోస్ట్ వాంటెడ్‌‌ టెర్రరిస్టుల్లో ఒకడైన సయీద్‌‌ను.. యూఎన్​ కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికా అతడిపై రూ.85 కోట్ల రివార్డ్‌‌ ప్రకటించింది.